భర్త విశ్రాంతి తీసుకుంటుంటే భార్యలు ఎలా రియాక్టు అవుతారో తెలుసా?

కానీ, తను శ్రమిస్తుండగా భర్త విశ్రాంతి తీసుకుంటుంటే ఆ మహిళల్లో ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) గణనీయంగా పెరుగుతుందని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి.;

Update: 2025-10-29 14:30 GMT

ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణ ఇవన్నీ గృహిణులకు రోజువారీ జీవితం. కానీ, తను శ్రమిస్తుండగా భర్త విశ్రాంతి తీసుకుంటుంటే ఆ మహిళల్లో ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) గణనీయంగా పెరుగుతుందని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి. ఇది కేవలం మానసిక ఆవేదన మాత్రమే కాదు.. శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉద్యోగం కంటే ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య, భారతీయ కుటుంబాల్లో సామాజిక అసమానతలు, లింగ బాధ్యతల విభజన లోపాలకు గుర్తింపు.

అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA), యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ పరిశోధకులు 500 మంది గృహిణులపై ఒక అధ్యయనం చేశారు. తమ భర్తలు ఇంటి పనుల్లో సహకరించకపోతే, మహిళల్లో కార్టిసాల్ స్థాయిలు 25 శాతం నుంచి 30 శాతంకు పెరుగుతున్నట్లు కనుగొన్నారు. కార్టిసాల్ అధికంగా ఉంటే, రక్తపోటు, డయాబెటిస్, డిప్రెషన్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. భారత్‌లో జరిపిన సర్వేలు (ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ) ప్రకారం, 68 శాతం మంది గృహిణులు ‘ఇంటి పనులు ఒంటరిగా చేయడం’ వల్ల ఒత్తిడికి గురవుతున్నారట. ఉద్యోగం చేసే మహిళల కంటే, గృహిణుల్లో ఒత్తిడి 15 శాతం ఎక్కువ ఎందుకంటే, వారికి విశ్రాంతి ఉండదు. భర్త సహకారం లేకపోవడం కూడా ఆమెలో కొంత అసహనం, ఆవేదనను పెంచుతుంది.

భారతీయ సమాజంలో ఇది ఎక్కువ..

ఈ సమస్య మూలాలు సామాజికంగా లోతుగా ఉన్నాయి. భారతీయ సమాజంలో ‘ఇంటి పని మహిళల బాధ్యత’ అనే స్టీరియోటైప్ ఇంకా బలంగా ఉంది. పురుషులు ఆర్థిక బాధ్యతలు తీసుకుంటారని, మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకోవాలని ఇక్కడి సమాజం భావిస్తుంది. కానీ, ఆధునిక కుటుంబాల్లో ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా, ఇంటి పనులు 70 శాతం మహిళలపైనే పడుతున్నాయి (ఆక్స్‌ఫామ్ ఇండియా రిపోర్ట్). భర్త విశ్రాంతి తీసుకుంటుంటే, మహిళలు ‘నేను ఎందుకు ఒంటరిగా?’ పని చేయాలని అనే ఆలోచనలో పడతారు. ఇది కార్టిసాల్ పెరగడానికి కారణంగా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. భర్త సహకారం ఉంటే, మహిళలు మరింత విశ్రాంతి తీసుకుంటారు. ఇది సోమరితనంగా భావించవద్దని ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ అని నిపుణులు చెప్తున్నారు.

మహిళల కంటే పురుషులే తక్కువగా..

భారత్‌లో మహిళలు రోజుకు 5-6 గంటలు ఇంటి పనులు చేస్తున్నారు. పురుషులు 30 నిమిషాలు మాత్రమే (NSSO డేటా) చేస్తున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ విపరీతంగా పెరుగుతున్నాయని సైకాలజిస్ట్ డా. సమీర్ పారిఖ్ చెబుతున్నారు. భర్తలు ఇంటి పనుల్లో సహకరిస్తే, మహిళల ఒత్తిడి 40 శాతం తగ్గుతుంది. (కానీ, సామాజిక ఒత్తిడి వల్ల పురుషులు ఇది మహిళల పని అని భావిస్తారు.) ఇది కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుంది, విడాకులు పెరగడానికి కారణం కూడా అవుతుంది.

తక్షణం మార్పు అవసరం..

విస్తృతంగా పరిశీలస్తే.. ఈ సమస్య భారతీయ కుటుంబ వ్యవస్థలో మార్పు అవసరాన్ని సూచిస్తుంది. ఆధునిక జీవితంలో ఇద్దరూ బాధ్యతలు పంచుకోవాలని పరిశోధనలు చెబుతున్నాయి. సహకారం ఉన్న కుటుంబాల్లో మహిళలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇది పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది. తల్లి ఒత్తిడికి గురైతే ప్రభావం పిల్లలపై పడి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. భర్తలు రోజువారీ పనులు (వంట, శుభ్రం, పిల్లల సంరక్షణ) పంచుకోవాలి. ప్రభుత్వం, NGOలు లింగ సమానత్వ అవగాహన క్యాంపెయిన్‌లు నడపాలి. స్కూల్స్‌లో పిల్లలకు ఇంటి పనులు ఇద్దరూ చేయాలని నేర్పించాలి.

Tags:    

Similar News