హెచ్ సీఏ జగన్మోహన్ రావు చుట్టూ ఉచ్చు.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు

తాజాగా హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టయ్యారంటే పరిస్థితి ఎలా ఉంటందో అర్థం చేసుకోవచ్చు.;

Update: 2025-07-11 06:17 GMT

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అంటేనే వివాదాలమయం.. నిండా రాజకీయాలతో, తరచూ అవినీతి ఆరోపణలు ముంచెత్తే క్రికెట్ సంఘం.. తాజాగా హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టయ్యారంటే పరిస్థితి ఎలా ఉంటందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న ఆయన రిమాండ్ రిపోర్టులో సీఐడీ కీలక విషయాలు పేర్కొంది. జగన్మోహన్ రావు గౌలిపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీ చక్ర క్లబ్ గా మార్చారని.. ఆ క్లబ్ డాక్యుమెంట్స్ లోని సంతకాలతో, యజమాని సంతకాలు సరిపోలడం లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ మేరకు కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది.

హెచ్ సీఏ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికయ్యారు జగన్మోహన్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సహజంగానే టార్గెట్ అయ్యారు. కొంత కాలం కిందట అధికార పార్టీ ఎంపీ ఒకరు తరచూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని జగన్మోహన్ రావు అదనపు టికెట్ల కోసం వేధించినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా వీఐపీ బాక్స్ కు తాళాలు వేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు తాము హైదరాబాద్ ను వీడి వెళ్లిపోతామని సన్ రైజర్స్ బెదిరించే వరకు వెళ్లాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. హెచ్ సీఏలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్ధతులు, బీసీసీఐ అందించే నిధుల దుర్వినియోగాన్ని సీఐడీ వెలుగులోకి తెచ్చింది. రెండు రోజుల కిందట జగన్మోహన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజుల రిమాండ్ విధించగా.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు.

నిరుడు మే నెల కంటే ముందు ఉప్పల్ స్టేడియంలో జరిగిన సంఘటనలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. హెచ్ సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రావు అక్రమ పద్ధతుల్లో ప్రవేశం పొందారని ఆరోపించారు. అధ్యక్షుడిగా గెలిచేందుకు నకిలీ పత్రాలు ఉపయోగించారని తెలిపారు.

జగన్మోహన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు. ఆయన గౌలిపురా క్రికెట్ క్లబ్ ను శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ గా మార్చారని.. ఈ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో ఓనర్ సంతకాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఫోర్జరీపై సీఐడీకి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఏ1 జగన్మోహన్ రావు, ఏ3 శ్రీనివాసరావు, ఏ4 సునీల్, ఏ5 రాజేందర్, ఏ6 కవిత. గౌలిపురా క్రికెట్ క్లబ్ కు మాజీ మంత్రి క్రిష్ణా యాదవ్ అధ్యక్షుడు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారని గురవారెడ్డి ఫిర్యాదు చేశారు. తద్వారా జగన్మోహన్రావు హెచ్ సీఏలోకి ప్రవేశించారు. దీన్ని మిగతా సభ్యులు వ్యతిరేకించినా అడ్డుకోలేకపోయారు. ఇక బీసీసీఐ నిధుల స్వాహా, డబ్బుతో ప్రతివాదుల ఓటమికి ప్రయత్నం, తనకు మద్దతు కోసం క్రికెట్ క్లబ్‌లకు డబ్బు చెల్లింపు తదితర అభియోగాలు జగన్మోన్ రావుపై ఉన్నాయి.

Tags:    

Similar News