'పుష్ప' డైలాగులు చెబుతోన్న బంగారం... రాబోయే 12 నెలల్లో అంచనాలివే!

అవును... జూన్ 13 నుంచి జూన్ 14 ఉదయానికల్లా బంగారం ధరలు రూ.2 వేలకు పైనే పెరిగాయి.;

Update: 2025-06-14 08:30 GMT
పుష్ప డైలాగులు చెబుతోన్న  బంగారం... రాబోయే 12 నెలల్లో అంచనాలివే!

గత కొంతకాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సామాన్యుడికి ఎంతో కొంత అందుబాటులో ఉన్న పసిడి.. రోజు రోజుకీ పేదవాడికి అందని ద్రాక్షలా మారిపోతోంది. ప్రధానంగా మూడు నాలుగు రోజులుగా ఎగబాకుతోన్న ధరలు.. గడిచిన 24 గంటల్లో శనివారం ఉదయానికి రూ.2 వేలకు పైనే పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే 12 నెలల్లో పరిస్థితిపై షాకింగ్ అంచనాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... జూన్ 13 నుంచి జూన్ 14 ఉదయానికల్లా బంగారం ధరలు రూ.2 వేలకు పైనే పెరిగాయి. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధం కారణంగా దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.2,200 పెరిగాయి. ఫలితంగా 10 గ్రాములు (తులం) బంగారం ధర రూ.1,01,680కి చేరుకుంది. దీంతో... రాబోయే రోజుల్లో ఈ విలువ ఏ మేరకు పెరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన మార్కెట్ నిపుణులు.. రాబోయే రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరగడంలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మధ్యాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్ లో అనిశ్చితి నెలకొందని, దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఎంపికలవైపు మొగ్గు చూపుతారని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే బంగారాన్ని ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగానే చూస్తారని.. దీని కారణంగా బంగారం డిమాండ్ లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించిందిందని.. ఇది ధరలు పెరగడానికి దారితీస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యలోనే రాబోయే రోజుల్లో బంగారం ధరలపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా.. పెరగబోయే బంగారం ధరలపై ఆసక్తికర అంచనా వేసింది.

ఇందులో భాగంగా... రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్సుకు 4,000 డాలర్ల వరకూ పెరగవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అదే సమయంలో గోల్డ్‌ మన్ సాచ్స్ కూడా 2025 చివరి నాటికి బంగారం 3,700 డాలర్లు 2026 మధ్య నాటికి ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని తన అంచనాను పునరుద్ఘాటించింది.

Tags:    

Similar News