మంత్రి కొండపల్లి ఉక్కిరిబిక్కిరి!

ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. తొలి చాన్స్ లోనే ఏకంగా మంత్రి పదవిని పట్టేశారు. రాజకీయంగా చురుకుగా ఉండే గజపతినగరం నుంచి 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.;

Update: 2025-07-07 06:30 GMT

ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. తొలి చాన్స్ లోనే ఏకంగా మంత్రి పదవిని పట్టేశారు. రాజకీయంగా చురుకుగా ఉండే గజపతినగరం నుంచి 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో ఆయన సొంత బాబాయ్ కొండపల్లి అప్పలనాయుడు నుంచే సీటు విషయంలో వ్యతిరేకత వ్యక్తం అయింది. అంటే ఆదిలో హంస పాదు అన్నమాట. దానిని ఎంతో చాకచక్యంగా ఆయన దాటుకుని గెలిచారు. అయితే ఇంట్లో బాబాయ్ నుంచి ఎంత మేరకు సహకారం అందుతోంది అన్నది ఒక చర్చ అయితే విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాత్రం ఆయనకు సవాళ్ళూ సమస్యలు అనేకం ఎదురవుతున్నాయని అంటున్నారు.

జిల్లాలో ఏకైక మంత్రిగా మొత్తం రాజకీయం మీద ఆధిపత్యం చలాయించాల్సి ఉండగా ఆయన వెనకబడ్డారు అని అంటారు. అంతే కాదు ఆయన అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కో ఆర్డినేట్ చేసుకోవడంలోనూ తడబడుతున్నారు అని అంటారు. జిల్లాను శాసించిన దిగ్గజ నేతలు అంతా విజయనగరం జిల్లాలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఒక వైపు అలాగే విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి గెలిచిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, బొబ్బిలి వంశీకుడు ఎమ్మెల్యే బేబీ నాయన వంటి వారు ఉన్నారు. మిత్ర పక్షంలో జనసేన దూకుడుగా ఉంది. బీజేపీ తన రాజకీయ వాటా కోసం పోరాడుతోంది.

విపక్షంలో చూస్తే సీనియర్ మోస్ట్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు ఆయన తమ్ముడే గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ. ఇంకా వైసీపీలో కీలక నేతలు అనేక మంది ఉన్నారు. ఇలా రాజకీయంగా చూస్తే ఆయన ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు చూస్తే జిల్లా కలెక్టర్ తో గ్యాప్ ఉందని కూడా ప్రచారం సాగింది. అయితే అలాంటిది ఏమీ లేదని అంతా ఒక్కటిగా కలిసి పనిచేస్తున్నామని మంత్రి గారే వివరణ ఇచ్చారు.

ఇపుడు చూస్తే ఎస్ కోట నియోజవర్గంలో సొంత పార్టీలోనే రెండు వర్గాల పోరుతో ఏకంగా మంత్రి గారికే ఇబ్బందికరంగా సన్నివేశం మారుతోంది అని అంటున్నారు. అక్కడ ఏర్పాటు చేయబోయే జిందాల్ పరిశ్రమకు నీటిని తాటిపూడి నుంచి ఇస్తారని ప్రచారం అయితే విపక్షాలు స్టార్ట్ చేశాయి. దానిని టీడీపీలో ఒక వర్గం పట్టుకుని స్థానిక ఎమ్మెల్యే మీద విమర్శలకు ఉపయోగించుకుంటోంది. ఏకంగా రైతులను రంగంలోకి తెచ్చి ఆందోళనలు నిర్వహించేలా టీడీపీలోనే ఒక వర్గం చేస్తుంది అని అంటున్నారు.

అలా రైతాంగం ఆందోళనకు మంత్రి గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిందాల్ కి తాటిపూడి నీరు ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం ఏదీ తీసుకోలేదని మంత్రి గారు అంటున్నారు. అయితే విపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆయన అంటున్నారు. కానీ అసలు వ్యవహారాన్ని నడిపిస్తోంది టీడీపీలో ఒక వర్గం అని అంటున్నారు. ఇలా ఇంటా బయట సమస్యలతో మంత్రి గారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. మరి ఆయన ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News