కమలంతో కయ్యం...జగన్ సిద్ధమేనా ?

వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీతో వైసీపీ యుద్ధం అన్నట్లుగా మారుతోంది. ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ మొదటి నుంచి బిగ్ సౌండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-19 11:48 GMT

వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీతో వైసీపీ యుద్ధం అన్నట్లుగా మారుతోంది. ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ మొదటి నుంచి బిగ్ సౌండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ కి ఈ కళాశాలలను అప్పగిస్తున్నారు అని వైసీపీ గట్టిగా మాట్లాడుతోంది, విద్యా వైద్యం ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అంటోంది. దీని వల్ల పేదలు పూర్తిగా నష్టపోతారు అని వాదిస్తోంది. ఇక కోటి సంతకాల పేరుతో దీని మీద వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఈ కోటి సంతకాలను తీసుకుని వెళ్ళి గవర్నర్ కి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

జైలులో పెడతా అంటూ :

జగన్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న విషయంలో కూటమి ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. ఆయన నేరుగా చంద్రబాబు నే టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర పార్టీలను ఆయన అనడం లేదు, ఇక ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మారుస్తున్న విషయంలో ఎవరెవరు ఉన్నారో వారిని అందరినీ కూడా తాము అధికారంలోకి వస్తే జైలులో పెడతామని సంచలన ప్రకటన చేశారు. అయితే ఆయన మాటలకు టీడీపీ నుంచి ఎటూ రియాక్షన్ ఉంటుంది. కానీ బీజేపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. అది కూడా కూటమిలో మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్. నిజమే ఆయన రియాక్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఆయనే ఆ శాఖను చూస్తున్నారు, పైగా వైద్య ఆరోగ్య మంత్రిగా ఉంటూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇవ్వడం వల్ల ఏపీకి మేలు జరుగుతుందని ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు.

దమ్ముంటే జైలులో పెట్టు :

వైసీపీకి ఊహించని విధంగా బీజేపీ నుంచి ఘాటైన రియాక్షన్ వచ్చింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ జగన్ చేసిన ప్రకటన మీద మాట్లాడుతూ దమ్ముంటే తనను అరెస్టు చేయమని భారీ సవాల్ నే చేశారు. మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని అధికారంలోకి వచ్చిన రెండు నెలలలో పంపుతాను అంటున్న జగన్ ముందు తనను జైలులో పెట్టించాలని సత్యకుమార్ యాదవ్ దీని మీద మాట్లాడుతూ ఫైర్ అయ్యారు జగన్ వి బెదిరింపు రాజకీయాలు అని ఆయన మండిపడ్డారు. ఇది ఆటవిక మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు.

పీపీఎతోనే మేలు :

తాము పేదలకు మరింత తొందరగా విద్య వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతోనే పీపీపీ మోడల్ లో వెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ మాత్రం పీపీ విధానంలో ఆసుపత్రులు కళాశాలలు నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చే సంస్థలను వ్యక్తులను జైలుకు పంపిస్తామని చెప్పడమేంటి అని ఆయన ప్రశ్నించారు. జగన్ వారిని జైలుకు పంపించలేరు సరికదా తల వెంట్రుక సైతం పీకలేరని ఆయన అన్నారు.

ముందు మీ జైలు చూసుకోండి :

జగన్ అవినీతికి సంబంధిని దాదాపుగా ముప్పయి దాకా కేసులు ఉన్నాయని ఆయన తాను జైలుకు పోకుండా చూసుకుంటే బెటర్ అని మంత్రి ఎద్దేవా చేశారు. నిజానికి ఈ పీపీపీ విధానం అన్నది కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయం అని మంత్రి అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం నీతి అయోగ్ ప్రతిపాదనతో తీసుకున్న డెసిషన్ అన్నారు. అలాగే న్యాయ స్థానాలు, పార్లమెంటరీ స్థాయీ సంఘం దీనిని సమర్ధించాయని చెప్పారు. కేవలం ఏపీ మాత్రమే కాదు దేశంలో 29 రాష్ట్రాలలో ఈ పీపీపీ మోడల్ అమలు అవుతొందని మంత్రి చెప్పారు. అందువల్ల జగన్ కి కనుక ధైర్యం ఉంటే తనను జైలుకు పంపించాలని ఆలాగే తన మీద సీబీఐ విచారణ కోరాలని ఆయన సవాల్ చేశారు.

మధ్యలో బీజేపీ :

నిజానికి బీజేపీ ఈ విధంగా అనూహ్యంగా మధ్యలోకి వస్తుందని వైసీపీ ఊహించి ఉండదని అంటున్నారు. ఇది కేవలం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిస్తే రాజకీయంగా తమకు లాభంగా ఉంటుందని వైసీపీ వ్యూహంగా ఉంది. కానీ ఏకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ఇలా అన్నీ ముందుకు వస్తే కనుక వైసీపీ ఏమి చేస్తుందన్నదే అతి పెద్ద చర్చగా ఉంది. జగన్ కూడా ఈ తీరున బీజేపీ మంత్రి నుంచి ఘాటు రియాక్షన్ ఊహించి ఉండరని అంటున్నారు. ఇప్పటిదాకా వైసీపీ బీజేపీని విమర్శించినది లేదు, ఏ విషయం అయినా కూడా టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తోంది. మరి బీజేపీ ఇంత క్లారిటీగా చెప్పిన తరువాత ఏకంగా మంత్రి సవాల్ చేసిన తరువాత వైసీపీ మౌనంగా ఉంటే ఏ మాత్రం కుదరదు, అలాగని కమలంతో కయ్యానికి సిద్ధంగా ఉంటుందా అన్నదే ఇపుడు ఆసక్తిని కలిగించే విషయంగా ఉంది. చూడాలి మరి. ఈ బిగ్ ట్విస్ట్ లో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో.

Tags:    

Similar News