శ్రీరాముడు ముస్లిం? టీఎంసీ ఎమ్మెల్యే దారుణ వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ ఎమ్మెల్యే ‘మదన్ మిత్రా’ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.;

Update: 2025-12-19 12:20 GMT

రాజకీయాలు రొచ్చుగా మారాయి. ఇతర మతాల వారిని హిందువులు ఏమన్నా అంటే వాళ్ల నుంచి వచ్చే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రాణాలు కూడా తీసేసేంత తీవ్రంగా ఆయా మతాల వారు స్పందిస్తున్నారు. కానీ హిందువులపై, హిందూ దేవుళ్లపై ఎవరు ఏమన్నా అంతటి ప్రతిస్పందన మన సమాజంలో కొరవడింది. అందుకే ఇష్టమొచ్చినట్టుగా హిందూయిజంపై దారుణ వ్యాఖ్యానాలు కొనసాగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ ఎమ్మెల్యే ‘మదన్ మిత్రా’ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘శ్రీరాముడు హిందువు కాదు.. ఆయన ఒక ముస్లిం’ అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది.

పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న పరిస్థితుల్లో మదన్ మిత్ర వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. శ్రీరాముడు హిందువు కాదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా బీజేపీ నాయకులకు ఒక వింత సవాల్ ను విసిరారు. ‘శ్రీరాముడు హిందువు అని మీరు చెబుతున్నారు కదా.. మరి ఆయన ఇంటిపేరు ఏంటో చెప్పగలరా? శ్రీరాముడు నిజానికి ఒక ముస్లిం’ అని మిత్ర వ్యాఖ్యానించారు.

రాజకీయ దుమారం.. బీజేపీ ఆగ్రహం

మదన్ మిత్రా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎంసీ మొదటి నుంచి హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయని మిత్రాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తగ్గేదే లేదంటున్న మిత్రా

తన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నప్పటికీ మదన్ మిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను దేనికీ భయపడనని.. చరిత్రను తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ సంస్కృతిలో అందరూ కలిసి ఉంటారని.. బీజేపీ కవాలనే మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని ఆయన ఎదురుదాడికి దిగారు.

పశ్చిమ బెంగాల్‌లో గత కొంతకాలంగా 'శ్రీరాముడు' కేవలం దైవంగానే కాకుండా ఒక రాజకీయ చిహ్నంగా మారిపోయారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఎజెండాగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మదన్ మిత్రా వ్యాఖ్యలు రాజకీయ స్టంట్‌గా కొందరు కొట్టిపారేస్తుంటే, మరికొందరు విశ్వాసాలను కించపరచడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి బెంగాల్ రాజకీయాల్లో ఈ 'రామ' మంత్రం ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News