పాకిస్థానీలకు చెమటలు పట్టిస్తోన్న కండోమ్ లు..!
ఈ సందర్భంగా స్పందించిన ఐఎంఎఫ్... గర్భనిరోధకాలపై ఏదైనా మినహాయింపు లేదా పన్ను కోతను తదుపరి ఫెడరల్ బడ్జెట్ లో మాత్రమే పరిశీలించవచ్చని..;
అటు దానాలు, ఇటు రుణాలపై మనుగడ సాగిస్తూ కాలం వెళ్లదీస్తున్న పాకిస్థాన్ కు ఇంటా, బయటా కష్టాలకు తోడు మరిన్ని కష్టాలు తోడవుతున్నాయి. ఇందులో భాగంగా.. కండోమ్ లు, ఇతర జనన నియంత్రణ సామాగ్రిని తక్కువ ధరలకు పొందాలని ఆశిస్తున్నారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. అయితే ఈ విషయంలోనూ ఆయన ఆశలు అడియాశలైన పరిస్థితి.
అవును... కండోమ్ లు, ఇతర జనన నియంత్రణ సామాగ్రిని తక్కువ రేటుకు దక్కించుకోవాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆశించారు. ఈ నేపథ్యంలో వాటిపై 18% జీఎస్టీని తగ్గించాలని ఆయన ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆ విజ్ఞప్తిని ఐఎంఎఫ్ తిరస్కరించింది. దీంతో ఆయన నిరాశ చెందినట్లు నివేదికలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన ఐఎంఎఫ్... గర్భనిరోధకాలపై ఏదైనా మినహాయింపు లేదా పన్ను కోతను తదుపరి ఫెడరల్ బడ్జెట్ లో మాత్రమే పరిశీలించవచ్చని.. ముఖ్యంగా పాకిస్థాన్ లో కొనసాగుతున్న బెయిలౌట్ కార్యక్రమం కింద సవరించిన ఆదాయ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడుతున్నందున.. అటువంటి పన్ను ఉపశమనం అమలు యంత్రాంగాలను బలహీనపరుస్తుందని హెచ్చరించింది.
కాగా.. ప్రస్తుతం ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాలపై మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం.. ఆ సంస్థ నిర్ధేశించిన నిబంధనలు, షరతులకు కట్టుబడే ఉండాలి. అలాకానిపక్షంలో.. డీఫాల్ట్, ఆర్థిక గందరగోళం ఏర్పడవచ్చు. పైగా ఐఎంఎఫ్ ఇప్పటికే సుమారు 3.3 బిలియన్ డాలర్లను పాకిస్థాన్ కు పంపిణీ చేసింది. అదనంగా మరో 1.2 బిలియన్ డాలర్లు ఆమోదించబడ్డాయి.
వాస్తవానికి పాకిస్థాన్ జనాభా పెరుగుదల రేటు ప్రస్తుతం 2.55% వద్ద ఉండగా.. ప్రతీ ఏటా సుమారు ఆరు మిలియన్ల మంది కొత్త పెరుగుతున్నారు. అయితే.. ఐఎంఎఫ్ ఆంక్షల కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం జనన నియంత్రణను సరిగ్గా అమలు చేయలేకపోతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కండోమ్ లపై జీఎస్టీ విషయంలోనూ పాక్ విజ్ఞప్తిని ఐఎంఎఫ్ తిరస్కరించింది.
ఈ సందర్భంగా... గర్భనిరోధకాలపై 18% జీఎస్టీని వెంటనే తొలగించడానికి ఆమోదం కోరుతూ అధికారికంగా ఐఎంఎఫ్ ని సంప్రదించాలని షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్.బీ.ఆర్)ని ఆదేశించిన నెలల తర్వాత.. ఆ ప్రతిపాదనను గౌరవించడం అసాధ్యమని ఐఎంఎఫ్ స్పష్టం చేసిందని.. పాకిస్థాన్ దినపత్రిక ది న్యు ఇంటర్నేషనల్ నివేదించింది.
ఎఫ్.బీ.ఆర్. అంచనాల ప్రకారం కండోమ్ లపై జీఎస్టీని రద్దు చేయడం వల్ల ఖజానాకు రూ.400 నుంచి 600 మిలియన్లు ఖర్చవుతాయని చెబుతున్నారు. మరోవైపు.. శానిటరీ ప్యాడ్ లు, బేబీ డైపర్ లపై జీఎస్టీని తగ్గించాలనే పాకిస్థాన్ అధికారుల ప్రతిపాదనలను ఐఎంఎఫ్ తిరస్కరించింది. ఇలాంటి ఉపశమనాలు పన్ను అమలును క్లిష్టతరం చేస్తాయని హెచ్చరించింది.