ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.. తెలంగాణలో ఆసక్తి!
అదేంటి అనుకుంటున్నారా? నిజమే. ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.;
అదేంటి అనుకుంటున్నారా? నిజమే. ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం వరకు కలెక్టర్ల సదస్సుతో బిజీగా ఉన్న ఆయన.. శుక్రవారం ఉదయం ఢిల్లీఫ్లైట్ ఎక్కారు. అయితే.. ఆయన దేశరాజధానిలో పర్యటిస్తుండడం పట్ల తెలంగాణలో రాజకీయ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సహా.. ప్రధాన ప్రతిపక్షం కూడా.. ఏం జరుగుతుంది ? అనే విషయంపై చర్చిస్తున్నారు.
దీనికి కారణం.. పోలవరం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి.. సీమకు నీటిని అందించే లింకు ప్రాజెక్టు పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది తెలంగాణలో ఆసక్తిగా మారింది. మొదట్లో పోలవరం - బనకచర్ల ప్రా జెక్టును నిర్మించాలని అనుకున్నా.. తెలంగాణ నుంచి వచ్చిన వ్యతిరేకత.. వ్యయం కూడా భారీగా ఉండ డంతో ఈ ప్రాజెక్టు స్థానంలో మరో ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం రూపొందించింది. అయితే.. ఈ ప్రాజెక్టు ను కూడా అడ్డుకుంటామని తెలంగాణ చెబుతోంది.
గోదావరి జలాలను ఏ రూపంలోనూ.. తోడిపోసేందుకు అనుమతి ఇవ్వరాదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. అదేవిధంగా గోదావరి జలాల ట్రైబ్యునల్‌కు కూడా తేల్చి చెప్పింది. అయితే.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్ర బాబు ఢిల్లీ వెళ్లడం.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కావడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో కేంద్రం ఎలాంటి హామీ ఇస్తుందోనన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఇప్పటికే గోదావరి, కృష్ణాజలాలపై తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ వివాదం నెలకొంది. అధికార పక్షంపై ప్రతిపక్షం నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తామని బీఆర్ ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. ఇది రాజకీయ దుమారం రేపే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఈ లోగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో ఆయన ఏం చేస్తారన్న విషయంపై తెలంగాణ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.