మంత్రి అయి తీరుతాను...ఆయన ధీమా వేరే లెవెల్

ఈ కీలక సమయంలో రాజ గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు నోచుకుంటున్నాయి. ఆయన సరైన సమయంలోనే స్పందించారు అని అంటున్న వారూ ఉన్నారు.;

Update: 2025-12-19 16:30 GMT

అవును ఆయన ధీమాగా ఉన్నారు. అంతే కాదు తాను మంత్రి అయి తీరుతాను అంటున్నారు. అదృష్టం తన ఇంటి తలుపు తట్టి మరీ మినిస్టర్ కుర్చీలో కూర్చోబెడుతుందని విశ్వాసంతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన తెలంగాణా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆయన మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఒక జిల్లా ఒకే కుటుంబం ఒకే సామాజిక వర్గం అన్న కారణంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు అని చెబుతారు. అయితే ఇవేమీ తన మంత్రి పదవికి అడ్డు కానే కాదు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు.

కేబినెట్ మార్పులపై :

ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు, ఆయన అక్కడ తన కేబినెట్ విస్తరణ గురించి, మార్పు చేర్పుల గురించి హై కమాండ్ తో చర్చించారు అని ప్రచారం ఒక వైపు సాగుతోంది. అదే సమయంలో ఆశావహులు చాలా మంది మంత్రి పదవి మీద మోజు పెంచుకుంటున్నారు. ఈ కీలక సమయంలో రాజ గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు నోచుకుంటున్నాయి. ఆయన సరైన సమయంలోనే స్పందించారు అని అంటున్న వారూ ఉన్నారు.

రెండు బెర్తులు ఖాళీ :

తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంతో తెలంగాణా కేబినెట్ లో సంఖ్య 16కి చేరుకుంది. ఆయన కంటే ముందు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు విస్తరణలో చాన్స్ ఇచ్చారు. ఇపుడు చూస్తే ఈ రెండు ఖాళీలఒత పాటు మరికొందరికి ఉధ్వాసన చెప్పి కొత్తగా అరడజన్ మందికి చోటు కల్పించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరి ఇన్ ఎవరు అవుట్ ఎవరూ అన్న చర్చ ఒక వైపు ఉంది, దీని కంటే ముందు ఎంత మంది ఆశావహులు ఉన్నారు అన్నది మరో చర్చ. ఇవన్నీ ఇలా ప్రచారంలో ఉండగానే రాజ గోపాల్ రెడ్డి మాత్రం మంత్రిని తాను అయి తీరుతాను అని చెబుతున్న మాటలు అయితే వైరల్ అవుతున్నాయి.

గ్రీన్ సిగ్నల్ వచ్చిందా :

రాజ గోపాల్ రెడ్డి ఇంతటి ధీమాతో ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో అధినాయకత్వం నుంచి ఆయనకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది. అంతే కాదు ఆయన తప్పకుండా చాన్స్ వస్తుందని చెప్పుకొస్తూండడంతో రాజకీయ ఉత్కంఠ ఇంకా పెరుగుతోంది. ఆయన లాజిక్ కూడా ఆలోచించేలా ఉంది. ఒకే కుటుంబం అయితే ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వకూడదు, అదేమైనా రూలా అని కూడా అంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా మంది పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డికి ఒక బెర్త్ ఖాయమని కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరహా రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్నది నిజం. అందుకే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఆయన మంత్రి కావచ్చేమో. కొత్త ఏడాది ఆయనకు గుడ్ న్యూస్ చెప్పవచ్చేమో అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News