ప్రభాకర్‌రావును లోతుగా విచారించండి: సుప్రీంకోర్టు
ఈ క్రమంలో ప్రస్తుత కస్టడీని ఈ నెల 25 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికపై కూడా కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.;
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్‌రావును మరింత లోతుగా విచారించాలని సుప్రీంకోర్టు తెలిపింది. తాము ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా మారాయని భావిస్తు న్నారా? అని ప్రశ్నించిన న్యాయస్థానం.. అలాంటిదేమీ పెట్టుకోవద్దని.. తాము ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నామని ప్రకటించింది.
ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావుకు శుక్రవారంతో ఆ గడువు తీరింది. అయితే.. విచారణ చివరి దశలో ఉందని.. ప్రభాకర్‌రావే అంతా చేశారని సాక్షులు చెబుతున్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైనదని.. గతంలో కూడా తాము ఇలాంటి కేసులను తీవ్రంగానే భావించామని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడు ఎంతటి వాడైనా.. లోతుగా విచారించాల్సిందేనని అభిప్రాయపడింది.
ఈ క్రమంలో ప్రస్తుత కస్టడీని ఈ నెల 25 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికపై కూడా కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పూర్వాపరాలను ఎప్పటికప్పు డు కోర్టుకు తెలియజేయాలని సిట్ అధికారులను ఆదేశించింది.
అయితే.. విచారణలో ఐపీఎస్ ప్రభాకర్‌రావు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఆయనేమైనా హృద్రోగ సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో విచారించాలని కోర్టు ఆదేశించింది. అన్నీ వీడియో రికార్డు చేయాలని తెలిపింది. కస్టోడియల్ రిపోర్టుపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే.. తమకు సంబంధిత సమాచారం ఇవ్వడంలో ప్రభాకర్‌రావు సహకరించడం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకు మరింత లోతుగా విచారించాల్సి ఉంటుందన్నారు. దీనికి కోర్టు అంగీకరించింది.