ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు బిగ్ షాక్.. సుప్రీం కీలక తీర్పు

నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.;

Update: 2026-01-21 10:21 GMT

ఏపీ లిక్కర్ స్కాం నిందితులు అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీసిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. రెగ్యులర్ బెయిల్ కోసం ఈ ముగ్గురు నిందితుల దాఖలుచేసిన పిటిషన్ ను తిరస్కరించింది. బెయిలు కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు డీఫాల్ట్ బెయిలుపై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే నిందితుల రెగ్యులర్ బెయిలు పిటిషన్ పై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

లిక్కర్ స్కాంలో నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు గతంలో ట్రయల్ కోర్టు డీఫాల్ట్ బెయిల్‌ మంజూరు చేసింది. దీనిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితులు సుప్రీంలో అప్పీలు చేశారు. అయితే అప్పట్లో హైకోర్టు తీర్పును తప్పుపట్టిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే నిందితులు రెగ్యులర్ బెయిలు తీసుకోవాలని సూచించింది. దీనిపై నిందితులు సుప్రీంలోనే రెగ్యులర్ బెయిలు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచిస్తూ తాజాగా తీర్పునిచ్చింది.

నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ఈ మేరకు ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు తమకు బెయిల్ కావాలంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది.ఈ కేసులో నిందితులకు తక్షణమే అరెస్ట్ ముప్పు లేకుండా కొంత ఉపశమనం కలిగించింది సుప్రీం కోర్టు. గతంలో తాము ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు ప్రస్తుతం కొనసాగుతాయని తెలిపింది. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోతే.. తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా నిందితులకు నాలుగు వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పించింది. దీంతో వారికి నెలరోజులపాటు రిలీఫ్ లభించిందని చెబుతున్నారు.

ఏపీ లిక్కర్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిలు మంజూరు చేసింది. అయితే ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో డీఫాల్ట్ బెయిలు రద్దు అయింది. హైకోర్టు నిర్ణయంతో ముగ్గురు నిందితులు గత ఏడాది నవంబరు నెలలో కోర్టులో లొంగిపోవాల్సివుంది. కానీ, నిందితులు హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీలు చేయడం ద్వారా స్టే తెచ్చుకున్నారు. ఈ పిటిషన్ పై తాజాగా మరోసారి విచారణ జరగింది. అయితే నిందితులు డీఫాల్ట్ బెయిలు స్థానంలో రెగ్యులర్ బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలని, అంతవరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీం తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టు నిర్ణయంతో నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప మళ్లీ ఏసీబీ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవాల్సివుంది. ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి ఏ31గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనను 2025 మే 13న సిట్ అరెస్టు చేసింది. అదేవిధంగా ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పను గత ఏడాది మే 16న అరెస్టు చేశారు. ఈ ముగ్గురికి సెప్టెంబరు 7న డీఫాల్ట్ బెయిలు మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వులతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. అయితే ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ అప్పీలు చేయడం, హైకోర్టులో సిట్ కు అనుకూలంగా తీర్పు రావడంతో నిందితులు మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ, నిందితులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసి ఊరట దక్కించుకున్నారు.

Tags:    

Similar News