అనంతబాబుకు కౌంట్ డౌన్.. సుప్రీం డెడ్ లైన్, పోలీసులకు చీవాట్లు!!

డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితుడుకు సహకరిస్తున్నారని ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు మండిపడింది.;

Update: 2026-02-20 09:51 GMT

డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితుడుకు సహకరిస్తున్నారని ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు మండిపడింది. హత్య కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సాగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పోలీసులకు చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ హెచ్చరించింది. సుప్రీం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుతోపాటు ఆయన భార్యను నిందితురాలిగా చేర్చుతూ పోలీసులు సప్లిమెంట్ చార్జిషీటు దాఖలు చేశారు. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీరియస్ కామెంట్లు చేయడం హీట్ పుట్టిస్తోంది.

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం 2022లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ1గా అనంతబాబుపై అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సకాలంలో చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో నిందితుడికి డీఫాల్ట్ బెయిలు లభించింది. ఇప్పటివరకు నిందితుడు డీఫాల్ట్ బెయిల్ పైనే ఉన్నాడు. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు 2022లో హత్య జరిగితే ఇప్పటివరకు అభియోగాలు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ సాగదీస్తున్నారని మండిపడింది.

అంతేకాకుండా ఏప్రిల్ 18వ తేదీలోగా అభియోగాలు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ తరువాత నవంబరు 30లోగా కేసు ట్రయల్ ముగించాలని హైకోర్టును ఆదేశించింది. అప్పటివరకు నిందితుడు అనంతబాబుకు డీఫాల్ట్ బెయిలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, అప్పట్లో అధికారంలో ఉండటంతో నిందితుడితో పోలీసులు కుమ్మక్కు అయ్యారని వ్యాఖ్యానించింది.

నిందితుడికి డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా చార్జిషీటు దాఖలు చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసింది. పోలీసులు, నిందితుడు సహకరించుకున్నట్లు కనిపిస్తోందన్న సుప్రీం వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. పోలీసుల తీరును తప్పుపట్టిన న్యాయస్థానం, కేసు ట్రయల్ పై నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం తీర్పుతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరిన్ని కష్టాలు చుట్టిముట్టినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం కేసు పునర్విచారణకు ఆదేశించడంతో అనంతబాబు భార్య నిందితురాలిగా మారారని అంటున్నారు. ఇప్పుడు సుప్రీం తాజా వ్యాఖ్యలతో మరో 9 నెలల్లో కేసు విచారణ ముగిసే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News