వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ నివేదిక కోరిన సుప్రీం

సుప్రీం సూచనలతో ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత పాక్షిక దర్యాప్తునకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని వైఎస్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.;

Update: 2026-01-20 10:11 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అర్ధాంతరంగా నిలిపివేసిందని, కుట్రదారుల పాత్రను బయటపెట్టలేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఈ విషయమై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అప్పట్లో సునీత వేసిన పిటిషనుపై విచారించి నిర్ణయం తీసుకోవాలని ట్రయిల్ కోర్టును సుప్రీం సూచించింది. సుప్రీం సూచనలతో ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత పాక్షిక దర్యాప్తునకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని వైఎస్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మంగళవారం వైఎస్ సునీత అప్పీలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు ముగియాలంటే ఎవరెవరిని విచారించాల్సివుంది? ఎవరిని కస్టడీకి తీసుకోవాల్సివుందనే విషయమై తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగింది. ముందుగా సునీత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రయల్ కోర్టుకు వెళ్లామని అక్కడ తదుపరి దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. తాము పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాము పిటిషనులో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకు పాక్షికంగా దర్యాప్తునకు అనుమతిచ్చారని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదించారు. ట్రయల్ కోర్టు తీర్పు న్యాయబద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. వివేకా కేసును దర్యాప్తును పాక్షికంగా జరిపించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని న్యాయవాది లూద్రా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో జస్టిస్ ఎంఎం సుందరేశ్ కల్పించుకుని వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా? అని సీబీఐని కోరారు.

ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని న్యాయమూర్తి కోరారు. ఎరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటున్నారో కూడా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారించాల్సిన అవసరం ఉందా? అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసరును అడిగి చెప్పగలమని, ఇందుకోసం రెండు వారాల సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఈ క్రమంలోనే కేసు విచారణను ఫిబ్రవరి 5వతేదీకి వాయిదా వేశారు.

Tags:    

Similar News