లివ్ ఇన్ సంబంధం - గాంధర్వ వివాహం... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

అవును... లివ్-ఇన్ పార్టనర్ కేసులో అరెస్టుకు భయపడిన తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం ఓ పిటిషన్ దాఖలు చేశారు!;

Update: 2026-01-21 13:30 GMT

ఇటీవల కాలంలో లివ్-ఇన్ సంబంధాల సంఖ్య పెరుగుతుందనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెద్దగా బాధ్యతలు ఉండవులే అని కొంతమంది పురుషులు.. తాము చాలా ఆధునికంగా ఆలోచిస్తున్నామన్నట్లుగా పలువురు మహిళలు ఈ తరహా బంధాల్లోకి అడుగుపెడుతున్నారనే చర్చ జరుగుతుంది! ఈ సమయంలో.. భారతీయ గాంధర్వ వివాహ సంప్రదాయానికి సమాంతరంగా లివ్-ఇన్ సంబంధాన్ని ఉదహరిస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది!

అవును... లివ్-ఇన్ పార్టనర్ కేసులో అరెస్టుకు భయపడిన తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం ఓ పిటిషన్ దాఖలు చేశారు! తాజాగా ఈ పిటిషన్ ను విచారిస్తున్నప్పుడు జస్టిస్ ఎస్ శ్రీమతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... లివ్-ఇన్ సంబంధాలను భారతీయ సమాజానికి సాంస్కృతిక షాక్ అని అభివర్ణిస్తూ.. అవి విస్తృతంగా ప్రబలంగా ఉన్నాయని అన్నారు. మహిళలు తాము ఆధునికంగా ఉన్నట్లు భావించి ఈ సంబంధాలలోకి ప్రవేశిస్తారని తెలిపారు!

కానీ.. వివాహంలో లభించే రక్షణలను చట్టం ఈ తరహా సంబంధాల్లో అందించదని తర్వాత గ్రహిస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే... పురాతన భారతీయ గ్రంథాలు ఎనిమిది రకాల వివాహాలను గుర్తించాయని.. వాటిలో గాంధర్వ వివాహం కూడా ఉందని.. ఇందులో ఆచారాలు లేకుండా పరస్పర ప్రేమ, సమ్మతితో యూనియన్ ఏర్పడుతుందని.. నేటి లివ్-ఇన్ సంబంధాలను కూడా ఇదే కోణంలో చూడవచ్చని జస్టిస్ ఎస్ శ్రీమతి అన్నారు!

ఈ క్రమంలోనే... లివ్-ఇన్ సంబంధాల ఆధునిక వెబ్ లో చిక్కుకున్న మహిళలను రక్షించాల్సిన బాధ్యత కోర్టులకు ఉందని నొక్కి చెప్పిన జస్టిస్ శ్రీమతి.. ప్రారంభంలో చాలామంది పురుషులు తమను తాము ఆధునికులుగా చూపించుకుంటూ ఈ బంధంలోకి అడుగుపెడతారు కానీ.. ఆ సంబంధం చెడిపోయినప్పుడు మాత్రం వారు స్త్రీ స్వభావాన్ని ప్రశ్నిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా.. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీ ఇవ్వడం నేరమని న్యాయమూర్తి అన్నారు.

ఇదే సమయంలో... సహజీవనం చేస్తున్న మహిళలకు చట్టపరమైన రక్షణ లేకుండా ఉండకూడదని.. తగిన సందర్భాలలో వారికి భార్య హోదా ఇవ్వవచ్చని జస్టిస్ ఎస్ శ్రీమతి అన్నారు! వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి, తర్వాత అందుకు నిరాకరించిన వ్యక్తి చట్టం నుండి తప్పించుకోలేడని ఆమె తెలిపారు! వివాహం సాధ్యం కాకపోతే, పురుషులు చట్టాన్ని ఎదుర్కోవాలని చెబుతూ... అతడి బెయిల్ పిటిషన్‌ ను జస్టిస్ శ్రీమతి తోసిపుచ్చారు!

Tags:    

Similar News