ఆ 2 సినిమా టికెట్ ధరల పెంపుపై అప్పీల్ వేళ.. హైకోర్టు కీలక ఆదేశాలు
సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమాల్లో రెండింటి (రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు) టికెట్ల ధరల్ని పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.;
సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమాల్లో రెండింటి (రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు) టికెట్ల ధరల్ని పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ప్రభుత్వ మెమోను ఆయన సవాలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి.. సదరు మెమోను రద్దు చేయటంతో పాటు.. టికెట్ ధరల్ని పెంచటానికి నిర్ణయం తీసుకుంటే తొంభై రోజుల ముందే వెల్లడించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేస్తూ షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎల్ఎల్ పీ దాఖలు చేసిన అప్పీలు తాజాగా విచారణకు వచ్చింది. ఈ అప్పీల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
దీనికి సంబంధించి ఇరు వర్గాల వాదనల్ని వింది. అనంతరం ఈ అప్పీలుపై స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతం టికెట్ ధరల పెంపునకు సంబంధించిన పిటిషన్లు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్నాయని.. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే.. సింగిల్ జడ్జి వద్దకే చెప్పుకోవాలని పేర్కొంది. దీంతో.. అప్పీలుకు వెళ్లిన షైన్ స్క్రీన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు ఊరట లభించలేదు. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లాల్సిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై తదుపరి చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.