ఆది, సోమ వారాల్లో తెగ టెన్షన్ పెట్టిన విమానాలు!

ఈ సమయంలో.. హాంకాంగ్‌ నుంచి ఢిల్లీ వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఈ సమస్యను గుర్తించడంతో దాన్ని వెనక్కి మళ్లించారు.;

Update: 2025-06-16 09:51 GMT

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన అనంతరం ఎయిరిండియా విమానయాన సంస్థలో వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఈ సంస్థకు చెందిన బోయింగ్‌ విమానం అహ్మదాబాద్‌ లో ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరవకముందే.. మరో విమానంలో సాంకేతిక లోపం ప్రయాణికులను కలవరపాటుకు గురిచేసింది.

అవును... ఎయిరిండియా విమానాల్లోని వరుస సంఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా అహ్మదాబాద్ ఘటన అనంతరం ఎయిరిండియాకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో.. హాంకాంగ్‌ నుంచి ఢిల్లీ వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఈ సమస్యను గుర్తించడంతో దాన్ని వెనక్కి మళ్లించారు.

ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ విమానం సోమవారం ఉదయం హాంకాంగ్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఈ క్రమంలో అది మధ్యాహ్నం 12:20 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అయితే.. మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ ఇన్‌ - కమాండ్‌ గుర్తించారు. దీంతో అప్రమ్తతమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు.

దీంతో.. అదృష్టవశాత్తూ ఈ విమానం హాంకాంగ్‌ ఎయిర్‌ పోర్టులోనే సురక్షితంగా దిగింది. దీంతో.. విమానంలో నుంచి ప్రయాణికులందరినీ దించేసిన అధికారులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు లండన్ నుంచి చెన్నైకి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ విమానంలోనూ సమస్య తలెత్తడంతో అర్ధాంతరంగా తిరిగి లండన్ కు మళ్లించారు.

కాగా... ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తరప్రదేశ్‌ లోని గాజియాబాద్‌ నుంచి బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం.. 9:20 గంటలకు కోల్‌ కతాకు చేరాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. అయితే... టేకాఫ్‌ కు ముందే దీనిని గుర్తించిన సంస్థ.. ప్రయాణాన్ని నిలిపివేసింది. దీంతో అది రన్‌ వేపైనే గంటసేపు ఉండాల్సి వచ్చింది.

ఇక శనివారం రాత్రి 9:20 గంటలకు గుహవాటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్ కతాకు 170 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్య పేరుతో ఆలస్యమైంది. సమస్య ఏమిటో, విమానం బయలుదేరేది ఎప్పుడో తెలియక ప్రయాణికులు ఇబ్బంది పడిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News