సైన్స్ అద్భుతం: ద‌శాబ్ధాల క్రితం తొల‌గించిన వృష‌ణం పిల్ల‌ల్ని పుట్టిస్తుంది!

ఈ వినూత్న చికిత్సలో భాగంగా... 2025లో ఆ వ్యక్తి శరీరంలో ఎనిమిది వేర్వేరు చోట్ల చిన్ననాటి కణజాల ముక్కలను అమర్చారు.;

Update: 2026-05-09 06:49 GMT

సైన్స్ రోజు రోజుకి కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ఆక‌ర్షిస్తూనే ఉంది. తాజా స‌మాచారం మేర‌కు..క్యాన్సర్ స‌హా ఇతర తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న బాలురలో వైద్య శాస్త్రం సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ.. రేడియేషన్ థెరపీలు ప్రాణాలను కాపాడినా అవి శరీరంలోని పునరుత్పత్తి వ్యవస్థ(పిల్ల‌లు పుట్టించే వ్య‌వ‌స్థ‌)పై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల చిన్నతనంలో ఈ చికిత్స పొందిన బాలురు పెద్దయ్యాక సంతానలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా మూడొంతుల మంది పురుషుల‌ వీర్యంలో శుక్రకణాలు లేని `అజూస్పెర్మియా` స్థితి ఏర్పడటం ఆందోళన కలిగించే విషయం.

ఈ సవాలుకు పరిష్కారంగా బెల్జియంకు చెందిన బ్రస్సెల్స్ యూనివర్సిటీ హాస్పిటల్ (వియుబి) వైద్యులు ఒక కొత్త‌ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. 2008లో సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న ఒక పదేళ్ల బాలుడికి కీమోథెరపీ ఇచ్చే ముందే అతడి భవిష్యత్తు సంతాన అవసరాల కోసం ఒక వృషణాన్ని తొలగించి... అందులోని కణజాలాన్ని గడ్డకట్టించి భద్రపరిచారు. దశాబ్ద కాలం తర్వాత ఆ బాలుడు పెరిగి పెద్దయ్యాక... అతనికి సహజంగా శుక్రకణాల ఉత్పత్తి లేదని గుర్తించిన వైద్యులు గతంలో దాచి ఉంచిన అదే కణజాలాన్ని తిరిగి అతడి శరీరంలోకి మార్పిడి చేశారు.

ఈ వినూత్న చికిత్సలో భాగంగా... 2025లో ఆ వ్యక్తి శరీరంలో ఎనిమిది వేర్వేరు చోట్ల చిన్ననాటి కణజాల ముక్కలను అమర్చారు. ఆశ్చర్యకరంగా... ఏడాది తిరగకముందే ఆ కణజాలం పునరుజ్జీవం పొంది ఆరోగ్యకరమైన క‌ద‌లిక‌ల్ని కలిగిన శుక్రకణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. చిన్నపిల్లల వృషణాల్లో ఉండే `స్పెర్మటోగోనియల్ స్టెమ్ సెల్స్` (SSCs) కు ఉండే అద్భుతమైన సామర్థ్యమే దీనికి కారణం. ఇవి సరైన వాతావరణం దొరికినప్పుడు పరిపక్వ శుక్రకణాలుగా మారగలవని ఈ ప్రయోగం నిరూపించింది.

అయితే ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయిన శుక్రకణాలు నేరుగా వీర్య వాహికలతో అనుసంధానం కావు. కాబట్టి సదరు వ్యక్తి తండ్రి కావాలంటే... వైద్యులు ఆ కణజాలం నుండి శుక్రకణాలను సేకరించి... ప్రయోగశాల పద్ధతులైన ఐవీఎఫ్ (ఐవిఎఫ్‌) లేదా ఇక్సీ (ఐసిఎస్ఐ) ద్వారా అండంతో ఫలదీకరణం చేయాల్సి ఉంటుంది. ఇది కొంత క‌ష్టంతో కూడుకున్న‌దే అయినా కానీ.. అసలు తండ్రి అయ్యే అవకాశమే లేని స్థితి నుంచి సొంత బిడ్డను పొందే మార్గం సుగమం కావడం విశేషం.

ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా కీమోథెరపీ పొందుతున్న వేలాది మంది బాలురకు ఒక గొప్ప వరంగా మారనుంది. 2002 నుండి బ్రస్సెల్స్ ఆసుపత్రి ప్రారంభించిన ఈ `టిష్యూ ఫ్రీజింగ్` పద్ధతిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసుపత్రులు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 3,000 మందికి పైగా బాలుర కణజాలాన్ని భవిష్యత్తు కోసం భద్రపరిచారు. ఈ పరిశోధనలు మరింత ముందుకు సాగితే ప్రాణాంతక వ్యాధుల నుంచి కోలుకున్న వారు తమ జీవితంలో సంతాన సాఫల్యతను కూడా పొందే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News