దెందులూరులో హైటెన్షన్.. అబ్బయ్య చౌదరి నివాసం వద్ద యుద్ధవాతావరణం
గత ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే చింతమనేని వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి;
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే చింతమనేని వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. గత ఫిబ్రవరిలో ఒకసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, పోలీసుల జోక్యంతో అప్పట్లో పరిస్థితులు సర్దుమణిగాయి. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విదేశాలకు వెళ్లడం, స్థానికంగా లేకపోవడంతో పరిస్థితులు ప్రశాంతంగా మారాయి. అయితే రెండు రోజుల క్రితం అబ్బయ్య చౌదరి మళ్లీ కొండలరావుపాలెంలోని తన నివాసానికి చేరుకోవడంతో టీడీపీ మద్దతుదారులు వివాదానికి దిగినట్లు వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు హల్ చల్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా, టీడీపీ కార్యకర్తలు చొరబడి కూలీలను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికారం అండతో తమపై టీడీపీ కార్యకర్తలు రౌడీయిజం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే 2019-24 మధ్య కొల్లేరులో రైతుల చేపలను అబ్బయ్య చౌదరి విక్రయించారని, వాటికి బకాయిలు చెల్లించాలని రైతులు కోరుతున్నారని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య ఇంటి వద్ద రైతులే ఆందోళనకు దిగారని టీడీపీ నేతలు వివరణ ఇస్తున్నారు. అయితే అధికార, విపక్షాలు బాహాబాహీకి దిగడంతో దెందులూరులో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొందని అంటున్నారు.
మరోవైపు టీడీపీ మూకలు తన ఇంటిపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా జిల్లాలోని వైసీపీ నేతలు అంతా ఏకమవుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అబ్బయ్య చౌదరికి చెందిన పామాయిల్ గెలలు కోయకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి ఒడిగడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆరోపించారు. తన సొంత తోటలో పామాయిల్ గెలలు కోసుకుంటే, బీరు బాటిళ్లతో దాడికి ప్రయత్నించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వక్క చెట్లు, గంధం చెట్లు కొట్టివేశారని, 45 పామాయిల్ చెట్లు చనిపోయాయని అబ్బయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు బిడ్డగా తన ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు. ఇదే పద్ధతులను తాము అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగించాలా? అని ప్రశ్నించారు. బీరు బాటిళ్లతో వచ్చి బెదిరిస్తే భయపడనని అన్నారు. నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ఇదే దుర్మార్గాన్ని అనుసరిస్తున్నారని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటే సరిపోదని, ప్రజలు కూడా మంచి ప్రభుత్వమని అనుకోవాలని హితవుపలికారు. తన విషయంలో ఎమ్మెల్యే చింతమనేని అనుసరిస్తున్న విధానాన్ని అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఆక్షేపించారు. ఎక్కడా ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకపోయినా, ఆయన మద్దతుతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని అబ్బయ్య చౌదరి ఆక్షేపించారు.