కేసీఆర్ ప్రత్యర్థిగా మైనంపల్లి?.. ఆసక్తికరంగా సిద్ధిపేట జిల్లా రాజకీయాలు
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇద్దరు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.;
బీఆర్ఎస్ పార్టీకి అత్యంత పట్టున్న సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడం, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కూడా ఉండటం జిల్లాలో కాంగ్రెస్ పట్టు బిగించేలా గట్టి స్కెచ్ వేస్తోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు చూపించిన ఈ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నాటికి కమలం వికసించింది. అయితే ఇప్పుడు ఆ రెండుపార్టీలకు చెక్ చెప్పి స్థానిక ఎన్నికల్లో హవా చాటుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ. ఇందుకోసం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రంగంలోకి దింపింది.
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇద్దరు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీశ్ రావు నియోజకవర్గం సిద్దిపేట బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు అప్పగించారని అంటున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ బలాబలాలుపై హనుమంతరావుకు అవగాహన ఉన్నందున ఆయన అయితే గులాబీ బాసుకు చెక్ పెట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ముందుగా గజ్వేల్ లో పార్టీని పర్యవేక్షించాలని మైనంపల్లికి సీఎం బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే తనకు గజ్వేల్ తోపాటు సిద్దిపేట బాధ్యతలు కూడా ఇవ్వాలని మైనంపల్ల కోరారని అంటున్నారు.
గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిన మైనంపల్లి ఈ సారి సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం మెదక్ లో ప్రస్తుతం హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆ స్థానాన్ని కొడుక్కి అప్పగించి తాను మరో నియోజకవర్గం చూసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్కాజిగిరి రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం కావడం, సిటీ పరిధిలో ఉండటంతో తన సొంత ప్రాంతంలోనే రాజకీయం చేయాలనే ఆలోచనతో మైనంపల్లి గజ్వేల్, సిద్దిపేట వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో కలిసొచ్చే కాలానికి అనుకున్నట్లు బలమైన ప్రత్యర్థులు అయిన కేసీఆర్, హరీశ్ రావులను టార్గెట్ చేయాలంటే ఆర్థికంగా బలవంతుడైన మైనంపల్లి వంటివారు కరెక్టు అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గజ్వేల్ లో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సిరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఢీకొట్టడంలో విఫలమవడం, ఆయనకు పార్టీలో మరో వర్గం నుంచి వ్యతిరేకత ఉన్న కారణంగా గజ్వేల్ బరిలో మైనంపల్లిని దించాలనే ప్రతిపాదనపై పీసీసీ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు.