యుద్ధం అంటే పాక్ కచ్చితంగా వెనుకంజే... తెరపైకి 93 అంచనాలు!
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.;
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పహల్గాం ఉగ్రదాడికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికే ఇచ్చినట్లు భారత ప్రధాని మోడీ తెలిపిన పరిస్థితి. మరోపక్క భారత్ 36 గంటల్లో తమపై దాడి చెస్తుందనే సమాచారం తమకు ఉందని పాక్ మంత్రి పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో 1993లో భారత్ – పాక్ సంబంధాలపై అమెరికా నిఘా సంస్థ ఓ రహస్య అంచనాలు ప్రచురించింది. ఈ డాక్యుమెంట్ ను ఇరు దేశాల సంబంధాలను పరిశీలించి 'నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్' (ఎన్ఐఈ) తయారు చేసింది. దీనిలో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా.. న్యూఢిల్లీ అంటే ఇస్లామాబాద్ కు లోలోపల భయాలు ఉన్నాయని తెలిపింది.
అవును... 1993లో భారత్ - పాక్ సంబంధాలపై అమెరికా నిఘా సంస్థ ఓ రహస్య అంచనాలు ప్రచురించింది. నాడు పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్.ఐ.ఈ.. సీఐఏకు పనిచేసే బ్రూస్ రీడెల్ నేతృత్వంలో ఈ పత్రాన్ని సిద్ధం చేశారు. ఇందులో పలు కీలక విషయాలు పొందుపరిచారు.
ఆ సమయానికి భారత్ లో బాబ్రీ మసీద్ ఘటన చోటు చేసుకోగా.. అంతర్గత కలహాలతో పాకిస్తాన్ సతమతమవుతోంది. ఆ సమయంలో భారత్ - పాక్ మాధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగడానికి 20 శాతం అవకాశం ఉందని నాడు సీఐఏ అంచనా వేసింది. దీనికి ఉగ్రదాడి, సైనిక విన్యాసాలతోపాటు హఠాత్తుగా చెలరేగే మత విద్వేషాలు కారణం కావొచ్చని పేర్కొంది.
అయితే... నాడు ఇటు భారత్ కానీ, అటు పాక్ కానీ యుద్ధం కోరుకోవడం లేదని ఆ డాక్యుమెంట్ వెల్లడించింది. అయితే... భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాకిస్థాన్.. కశ్మీర్ లో వేర్పాటువాద శక్తులతో చేతులు కలపడం, ఉగ్రవాదులతో జట్టు కట్టడం, కశ్మీర్ ను వేరు చేసేందుకు ఉగ్రమూకలకు ఆయుధాలు సమకూర్చడం వంటివి చేస్తుందని పేర్కొంది!
ఆ సమయంలో అటు ఆర్థికంగా, ఇటు సైనిక పరంగా, మరోపక్క దౌత్యపరంగా న్యూఢిల్లీ వేగంగా ఎదుగుతోందని ఆ డాక్యుమెంట్ అభివర్ణించింది. ఇరు దేశాల మధ్య ఆ అంతరాన్ని పాక్ అందుకోలేదని వెల్లడించింది. ఆ సమయంలో భారత్ కు కేవలం అంతర్గత సమస్యలు, ఆర్థికాభివృద్ధి మాత్రమే సవాలుగా ఉందని తెలిపింది.