రోజులు లెక్కపెట్టుకోండి.. మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!
మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. మహిళా ఎమ్మెల్యేను కించపరిస్తే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.;
మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది అయినా కొందరు మంత్రులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే ఉంటే రోజులు లెక్కపెట్టుకోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ స్థానాల్లో కొత్త మంత్రులు వస్తారని సీఎం సూటిగానే చెప్పేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడినా కొందరు మంత్రులు పట్టించుకోలేదన్న ఆగ్రహం ముఖ్యమంత్రిలో కనిపించినట్లు చెబుతున్నారు.
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. అధికారులతో సమావేశం పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లభించకుండా వైసీపీ 200 మంది ఇన్వెస్టర్లకు లేఖలు రాసిన అంశం చర్చకు వచ్చిందని చెబుతున్నారు. అదే సమయంలో మహిళా ఎమ్మెల్యే పట్ల వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలపైనా సీరియస్ గానే డిస్కషన్ నడిచిందని అంటున్నారు. ఈ సమయంలోనే మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. మహిళా ఎమ్మెల్యేను కించపరిస్తే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలోనే నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గాయని, చేసిన మంచిని చెప్పుకోవడంలో మంత్రులు విఫలమయ్యారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. జగన్ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సీఎం సూచించారు.
ఇక మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా లేరన్న విషయం మరో మారు బయటపడటంతో మంత్రుల్లో గుబులు రేగుతోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నుంచి మంత్రుల పనితీరును సీఎం ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అధికారం సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో ఈ సారి యువతకు పెద్దపీట వేశారు. మొత్తం మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన వారికి, తొలిగా మంత్రి పదవుల్లోకి తీసుకున్నవారే దాదాపు 18 మంది ఉన్నారు. ఈ కొత్త జట్టుతో పాలనను పరుగుపెట్టించాలని సీఎం భావించారు. అయితే కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారని అంటున్నారు. దీంతో తరచూ వారిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు సీఎం. అయినా చంద్రబాబు స్పీడ్ ను అందుకోవడంలో కొందరు వెనకబడిపోతున్నారన్న కారణంగా తన జట్టులో మరికొందరిని చేర్చుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
అయితే ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కావడంతో అప్పుడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే బాగుండదనే అభిప్రాయంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. వాస్తవానికి ఆరు నెలల కిందటే ఒకరిద్దరిని తప్పించాలని భావించారని, వారి స్థానంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన ఉండేదని గుర్తు చేస్తున్నారు. అయితే మంత్రులు తమ పనితీరు మెరుగుపరచుకునేందుకు కొంతకాలం అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఇలాంటి తర్జనభర్జనకు అవకాశం లేకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, ఆయన తాజా వ్యాఖ్యలు ఈ సంకేతాలను ఇస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.