బాబుకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందా ?
చంద్రబాబు అంటే రాజకీయ అనుభవం విశేషంగా ఉన్న నాయకుడు. అంతే కాదు ప్రస్తుతం నాలుగవ సారి ఏపీకి సీఎం గా వ్యవహరిస్తున్నారు. టీడీపీ మీద పూర్తి పట్టు ఉంది.
చంద్రబాబు అంటే రాజకీయ అనుభవం విశేషంగా ఉన్న నాయకుడు. అంతే కాదు ప్రస్తుతం నాలుగవ సారి ఏపీకి సీఎం గా వ్యవహరిస్తున్నారు. టీడీపీ మీద పూర్తి పట్టు ఉంది. పార్టీని గత 31 ఏళ్ళుగా తన భుజ స్కందాలు మీద మోస్తున్నారు. పార్టీలో సగానికి పైగా క్యాడర్ ని ఆయన నేరుగా గుర్తు పట్టేంత పరిచయాలు ఉన్నాయి. ఇక తాను టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యేల విషయంలో బాబుకు ఉన్న ఫోకస్ కూడా చాలా గట్టిదే అని అంటారు. ఇక ఈసారి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని బాలెన్స్ చేస్తూ బాబు రోజు మొత్తంలో అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తరచూ టెలి కాన్ఫరెన్స్ లు పెడుతున్నారు. వీలు వెంబడి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా బాబుకు ఎమ్మెల్యేలకు మధ్య ఎక్కడో గ్యాప్ ఉందని అయితే ప్రచారం సాగుతోంది. బాబు ఆదేశాలు సూచనలు ఒక వైపు ఉంటే ఎమ్మెల్యేల తీరు మరో విధంగా ఉందని అంటున్నారు.
తప్పు చేస్తే యాక్షన్ :
ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే ముందు క్రమశిక్షణే గుర్తుకు వస్తుంది. అక్కడ ఎవరైనా ఎంతటి పెద్ద వారు అయినా తప్పు చేస్తే యాక్షన్ కచ్చితంగా ఉంటుంది. ఏకంగా సస్పెండ్ చేసే దాకా వ్యవహారం వెళ్తుంది. ఆఖరుకు పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు అయినా బాబు మాట వేదంగా ఉంటుంది. ఎవరైనా సరే పార్టీ ముందుకు రావాల్సిందే. బాబుకు అంతగా కంట్రోల్ పార్టీ మీద ఉంది. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి బంపర్ విక్టరీని కొట్టింది. అయితే ఇంత భారీ మెజారిటీ వచ్చిన తరువాత మాత్రం టీడీపీలో గతంలో మాదిరిగా పరిస్థితి లేదని అంటున్నారు. కొంచెం క్రమశిక్షణ కూడా తగ్గింది అని అంటున్నారు.
ఎమ్మెల్యేలను ఏమీ చేయరా :
పార్టీలో చిన్న స్థాయి నాయకులు క్యాడర్ ని అయితే సస్పెండ్ చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేలను మాత్రం ఏమీ చేయరు కదా అన్న ధీమా అయితే పెరిగింది అని అంటున్నారు. ఇక చూస్తే గతానికి ఇప్పటికీ పొలిటికల్ ట్రెండ్ మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో అన్నది ఎమ్మెల్యేల ఆలోచన. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని తపన పడుతున్నారని అంటున్నారు. తమకు టికెట్ రావాలి మరిన్ని సార్లు గెలవాలి అన్న ఆలోచన అయితే చాలా మంది అయితే ఇపుడు చేయడం లేదు. ప్రస్తుతం చేతిలో అధికారం ఉంది అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు అయితే బాగానే పోగేసుకునే పనిలో పడ్డారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ తరహా ఆరోపణలు వచ్చినపుడు అధినాయకత్వం ఎంత చెబుతున్నా వినడం లేదని అంటున్నారు. ఈ రకమైన అవినీతి ఆరోపణలు కొంతమంది ఎమ్మెల్యేల మీద రావడం బాబు దాకా చేరింది అని అంటున్నారు. అయినా ఎక్కడా కూడా అడ్డగోలు సంపాదన అయితే ఆగడం లేదని అంటున్నారు.
పార్టీని వదిలి మరీ :
ఇక కొందరు ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది అంటే పార్టీ క్యాడర్ ని సైతం పక్కన పెట్టి వారికి ఏమీ చేయకుండా పార్టీ గురించి ఆలోచించకుండా తమ వ్యాపకాలలో మునిగి తేలుతున్నారు అని అంటున్నారు. దొరికిన కాడికి అన్నట్లుగా జోరు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ దాకా ఫిర్యాదుల రూపంలోకి వెళ్ళినా ఆయన చెప్పినా కూడా ఎవరూ వినడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఇక పోతే పార్టీ క్యాడర్ ఫస్ట్ అని చంద్రబాబు లోకేష్ తరచూ చెబుతూ ఉంటారు, కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే క్యాడర్ అల్లల్లాడిపోతోంది, ఎమ్మెల్యేలు కొందరు చిత్తం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా చంద్రబాబు చెప్పినా కొందరు వినకపోగా దారికి రావడం లేదని అంటున్నారు.
చాన్స్ ఉన్నపుడే అన్నదే :
ఇపుడు రాజకీయం పూర్తిగా మారిపోయింది. చాన్స్ ఉన్నపుడే చక్కబెట్టుకోవాలన్న నయా రాజకీయ నీతి బాగా పనిచేస్తోంది. అయిదేళ్ళ పాటు అన్నీ మూసుకుని పనిచేసి ఆ మీదట టికెట్ దక్కించుకోవడం కోసం చూడడం కంటే ఎమ్మెల్యేగా తమ పదవి ఉన్నపుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుని పోతే చాలు కదా అన్న వినూత్న ఆలోచనలు చాలా మంది చేస్తున్నారు. అతని కంటే ఘనులు అన్నట్లుగా వీరి తీరు ఉంది. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అంతటా ఉంది. అయితే క్రమశిక్షణకు మారు పేరు అన్న టీడీపీలో ఈ పరిస్థితులు ఉండడమే విచిత్రంగా చూస్తున్నారు. వీరిని వన్ టైం ఎమ్మెల్యేలు అని ముద్ర వేసినా ఖాతరు చేయడం లేదు,
ఫుల్ బిజీగా మారి :
సమాజంలో డబ్బు ఒక్కటే ముఖ్యం అని అంటున్నారు. అందుకే దాని కోసమే పని చేస్తున్నరు అంటున్నారు. అలా కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బు సంపాదనలో ఫుల్ బిజీగా మారి పార్టీ జనాలను ఎన్నుకున్న జనాలను పక్కన పడేతున్నారు అని ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. మరి ఇలా ఫిర్యాదులు వచ్చిన వారికి హెచ్చరికలు సరిపోవడం లేదు, మరి కఠిన నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉందా అన్నదే ప్రశ్న. మరి ఒకరిద్దరి విషయంలో గట్టి చర్యలకు దిగితేనే మిగిలిన వారు దారికి వస్తారు అని అంటున్నారు. లేకపోతే పార్టీకి చాలా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. మరి హైకమాండ్ తరువాత స్టెప్ ఏమిటి అన్నదే ఇపుడు అంతా చూస్తున్నారు.