బాబుపై.. ఒక్కొక్కరిది ఒక్కోరకం అభిమానం!
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆయన పట్ల అభిమానం చాటుకున్నారు.;
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆయన పట్ల అభిమానం చాటుకున్నారు. వాస్తవానికి పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించడం పెద్ద విశేషమే అయినా.. దానికి మించి.. చంద్రబాబు విషయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అభిమానం చాటడం విశేషం. కాకినాడకు చెందిన సైకత శిల్పి.. శ్రీనివాస్.. తన అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు. మనం నిత్యం వినియోగించే సబ్బుపై.. చంద్రబాబు ముఖచిత్రాన్ని యాజ్ ఇటీజ్ అన్నట్టుగా దింపేశారు. దీనికిగాను.. ఆయన 13 గంటల పాటు శ్రమించారట.
ఇక, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో రైతులు.. తమ అభిమానాన్ని మరో రూపంలో చాటుకున్నారు. ధాన్యంతో చంద్రబాబు చిత్తరువును.. అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన కుర్చీలో కాలుపై కాలు వేసుకునిఉన్న భంగిమలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం విశేషం. అంతేకాదు.. ఆయన చుట్టూ.. పలు పథకాలకు సంబంధించి బొమ్మలను రంగురంగుల్లో తీర్చిదిద్దారు. వీటిలో హార్టీ కల్చలర్ హబ్ నుంచి ఐటీ పరిశ్రమల వరకు పలు పథకాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుకు 76వ జన్మదిన శుభాకాంక్షలు అనికూడా ధాన్యంతోనే రాయడం విశేషం. ఈ చిత్రం అత్యంత ఆకర్షణీయంగా ఉండడం గమనార్హం.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా.. కూడా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు పాలన సుభిక్షంగా ఉందని ఆయా కార్యక్రమాల్లో నాయకులు పేర్కొన్నారు. ఇక, సాధారణ కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుడి వరకు కూడా అందరూ రక్తదానం చేశారు. పలు చోట్ల అన్నదానాలు, వస్త్రదానాలు నిర్వహించారు. ఇలా.. ఎవరికి వారు ఒక్కొక్క రీతిలో చంద్రబాబు పట్ల తమ అభిమానం చాటుకున్నారు.