చంద్రబాబు మిషన్ - 2029, యర్రగొండపాలెంపై వర్క్ అవుట్ అవుతుందా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన పాలక టీడీపీ కూటమి.. వచ్చే ఎన్నికల్లోనూ విక్టరీ రిపీట్ చేయాలని అనుకుంటోంది.;

Update: 2026-02-26 18:30 GMT

గత అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన పాలక టీడీపీ కూటమి.. వచ్చే ఎన్నికల్లోనూ విక్టరీ రిపీట్ చేయాలని అనుకుంటోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ ప్రతి రోజూ రేపే ఎన్నికలు అన్నంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నిరంతరం అధికారం కాపాడుకునే ఆలోచనతోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. తమ ప్రభుత్వాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తేనే అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రచారం చేస్తున్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు కూటమిలో కీలక నేతలు అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సైతం మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని అనుకుంటున్నారు. ప్రజలకు కూడా ఇదే విషయం చెబుతూ కూటమిగా కొనసాగుతామని తమను మళ్లీ మళ్లీ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

గత 20 నెలలుగా పకడ్బందీ వ్యూహంతో కదులుతున్న కూటమి సర్కారు మిషన్ - 2029 ప్రణాళికలను సిద్ధం చేసిందని అంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార కూటమి ఆలోచనలు చూస్తుంటే ప్రతి రోజూ ఎన్నికే అన్నస్థాయిలో పనిచేస్తున్నట్లు ఉందని అంటున్నారు. దీనికి సీఎం చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. బుధవారం మార్కాపురం జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా విపక్షం వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా, గత ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు చోట్ల ఓడిపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మార్కాపురం జిల్లా పర్యటన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఇద్దరు రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆ పనులు జరుగుతున్న యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గెలవకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత ఒక నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయామో తెలుసుకునే ప్రయత్నం చేయడం, అదీ సాధారణ వ్యక్తులతో ఈ అంశంపై చర్చించడం చూస్తే క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి చంద్రబాబు ఎంతలోతుగా ఆలోచిస్తున్నారో అర్థమవుతోందని అంటున్నారు.

మిషన్ 2029 దిశగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ప్రతి నెలా నియోజకవర్గాల వారీగా సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏం పనిచేస్తున్నారు? ప్రజల స్పందన ఎలా ఉంది? వంటి విషయాలపై నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రత్యేక సర్వేల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ వెనకబడిన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరుచుకునే అంశాలపై సూచనలు సలహాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు యర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారని అంటున్నారు.

యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ గెలుపు రుచిచూడలేదు. 1955 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న యర్రగొండపాలెం 1972లో రద్దు అయింది. మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఇలా రెండున్నర దశాబ్దాల క్రితం పుట్టుకొచ్చిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుసగా టీడీపీ ఓడిపోతూనే వస్తోంది. 2009లో కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది.

యర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి ఎన్నిక సమయంలోనూ అంతకుముందు ఎన్నికల వైఫల్యాలను సరిదిద్దుకుని తలపడుతున్నా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు మాత్రం సాధ్యం కావడం లేదు. చివరికి 2024 ఎన్నికల్లో సునామీలా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా రెపరెపలాడినా యర్రగొండపాలెంలో మాత్రం ఆ పార్టీకి విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో మిషన్ 2029లో అయినా ఈ నియోజకవర్గంలో గెలవాలన్న టార్గెట్ తో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెబుతున్నారు.

కరువు, కాటకాలకు నిలయమైన యర్రగొండపాలెం నియోజకవర్గానికి జలకళ తీసుకురావడానికి వెలిగొండ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఈ పనులు పూర్తి చేయించి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు యర్రగొండపాలెంను కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిధిలో చేర్చి ఒంగోలుకు వెళ్లాల్సిన బాధలు తప్పించారు. ఇంతలా ఆ నియోజకవర్గానికి మేలు జరిగేలా తాను పనిచేస్తున్నా, ఓట్లు ఎందుకు పడటం లేదన్న ఆవేదన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే తన మనసులో మాటను బయటపెట్టారని అంటున్నారు. సీఎం ఎలాంటి శషబిషలకు గురికాకుండా రైతులతో యర్రగొండపాలెంలో ఓట్లు వేయలేదని ప్రశ్నించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు స్థాయిలో ఉన్న నేత.. ఒక నియోజకవర్గంపై గురిపెట్టడం చూస్తే వచ్చే ఎన్నికలకు పెద్ద స్కెచ్చే వేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News