బాబుకు ఇదే లాస్ట్ చాన్స్...చెప్పింది ఎవరంటే ?
ఏపీ సీఎం చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 1995 లో తొలిసారి సీఎం అయితే మూడు దశాబ్దాల తరువాత కొనసాగడం ఒక రికార్డు.
ఏపీ సీఎం చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 1995 లో తొలిసారి సీఎం అయితే మూడు దశాబ్దాల తరువాత కొనసాగడం ఒక రికార్డు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీకి రెండు సార్లు విభజన ఏపీకి రెండు సాలు బాబు సీఎం గా వ్యవహరించారు. ఇలా పనిచేసిన వారు కూడా తక్కువ. టంగుటూరి ప్రకాశం ఉమ్మడి మద్రాస్ స్టేట్ కి ముఖ్యమంత్రిగా అలాగే విభజన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సీఎం గా చేశారు. ఇక బాబు విషయం తీసుకుంటే ఆయనకు ఏజ్ అన్నది ఒక నెంబర్ మాత్రమే అని అంతా అంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం 2014 ఎన్నికల నుంచి కూడా బాబు ఏజ్ గురించి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. బాబు వయసు పెద్దది అని ఆయన చెబుతూ యువ నాయకత్వం గురించి జనాలకు గట్టిగా వినిపిస్తున్నారు.
ఏజ్ ఫ్యాక్టర్ ఏమి చేస్తుంది :
అయితే 2014 లో బాబు అనుభవానికి ఓటేసిన జనాలు 2024 లో మరోసారి అందుకే పట్టం కట్టారు అని విశ్లేషణలు ఉన్నాయి. రాజకీయాల్లో ఏజ్ ఫ్యాక్టర్ ఒక్కోసారి మైనస్ అవుతుందేమో కానీ ఎక్కువ సార్లు అనుకూలంగానే ఉంటుంది. నిన్నటికి నిన్న కేరళం కి సీఎం గా రెండు సార్లు చేసి ఓడిన పినరయ్ విజయన్ వయసు కూడా 80 దాటింది. అలాగే దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల వయసు ఏడున్నర పదులు దాటి ఉంది. అఫ్ కోర్స్ దేశ రాజకీయాల్లో యూత్ లీడర్లకు కూడా ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే జగన్ మాత్రం బాబు వయసు గురించి తాజా ప్రెస్ మీట్ లో మరోసారి కామెంట్స్ చేశారు.
ఇదే చివరి అవకాశం :
చంద్రబాబు వయసు 77 ఏళ్ళు అని జగన్ కామెంట్స్ చేశారు. ఈ వయసులో ఆయన తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హిత బోధ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం దారుణమైన రాజకీయాలు ఏపీలో చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ వాటికే రెక్కలు కట్టి తమకు ఉన్న మీడియా బలంతో వైసీపీ మీద బురద జల్లుతున్నారని జగన్ ఆగ్రహించారు. ఈ విధంగా చేయడం భావ్యమేనా బాబూ అని ప్రశ్నించారు. ఒక విధంగా చూస్తే చంద్రబాబుకు ఇదే చివరి అవకాశం అని జగన్ అన్నారు. దాంతో ఇపుడు దీని మీదనే చర్చ సాగుతోంది.
వైసీపీ ధీమా :
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని వైసీపీకి ధీమా ఉంది. అయితే ఆ నమ్మకం సంగతి పక్కన పెడితే 2024 లోనూ వై నాట్ 175 అని అదే పార్టీ పెద్దలు నినదించారు. కానీ ప్రజలు మాత్రం భిన్నంగా తీర్పు ఇచ్చారు. మరి 2029 ఎన్నికల్లో కూడా వైసీపీ ఆలోచనలు ఆశలు ధీమాలు అన్నీ ఒక ఎత్తున ఉంచి మరోసారి కూటమికే అధికారం అప్పగిస్తే అపుడు కూడా బాబుకు చివరి చాన్స్ ఎందుకు అవుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. బాబు ఐదవసారి కూడా ముఖ్యమంత్రిగా చేయాలని జనాలు కోరుకుంటే ఆయనే కదా సీఎం అని కూడా అంటున్నారు. అయితే వైసీపీ పెద్దల ఆలోచనలు కానీ జగన్ కామెంట్స్ కానీ చూస్తే బాబు కి సీఎం గా ఉన్నది మూడేళ్ల కాలమే అని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీల ఆలోచనలు విమర్శలు ఇవన్నీ పూర్వ పక్షంగానే ఎపుడూ ఉంటాయి. ప్రజలు మెచ్చి అధికారం అప్పగిస్తే ఎవరూ కాదనలేరు కదా అని అంటున్నారు. అయినా రాజకీయాల్లో లాస్ట్ చాన్స్ అన్నది ఎప్పటికీ ఉండదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.