మోదీని బ్రిటన్‌లోనూ వదలని ‘గుజరాతీ చాయ్‌’ బంధం..

స్టార్మర్‌తో కలిసి చాయ్‌ తాగిన అనంతరం సంబంధిత ఫొటోలను మోదీ ట్వీట్‌ చేశారు. ‘చెకర్స్‌లో మోదీ, కీవ్‌ స్టార్మర్‌తో ‘చాయ్‌ పే చర్చ’, భారత్‌-యూకే సంబంధాలు బలోపేతం అవుతున్నాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.;

Update: 2025-07-25 16:37 GMT

ప్రధాని మోదీ ఒకప్పుడు చాయ్‌ అమ్మారనే సంగతి మనందరికీ తెలిసిందే. దీనిని ఆయనే బయటపెట్టారు. గుజరాత్‌లో తన తండ్రి చాయ్‌ దుకాణంలో తాను సాయపడినట్లు తెలిపారు. దీంతో చాయ్‌వాలా స్థాయి నుంచి ఎదిగారని అందరూ ఆయనను గౌరవంగా చూసేవారు. ఒక చాయ్‌ పే చర్చ అంటూ ఏకంగా ఓ కార్యక్రమమే మొదలైంది ఈ ప్రభుత్వంలో..! అలా మోదీకి చాయ్‌కి విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు ఇది బ్రిటన్‌ పర్యటనలోనూ బయటపడింది.

మోదీ ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తూ ఆ దేశ ప్రధాని స్టార్మర్‌తో చర్చలు జరుపుతున్నారు. అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ప్రధానిగా ఉన్నప్పటికీ బ్రిటన్‌తో సాధ్యం కాని ఒప్పందం ఇది. అయితే, ఈ పర్యటనలో స్టార్మర్‌తో కలిసి మోదీ ఓ చాయ్‌ తాగడం ప్రత్యేకత సంతరించుకుంది.

ఈ చాయ్‌ తయారు చేసింది భారత సంతతికి చెందిన అఖిల్‌ పటేల్‌ అనే గుజరాతీ. యువ వ్యాపారవేత్త అయిన అఖిల్‌ది అసాధారణ నేపథ్యం. స్టార్మర్‌తో కలిసి చాయ్‌ తాగిన అనంతరం సంబంధిత ఫొటోలను మోదీ ట్వీట్‌ చేశారు. ‘చెకర్స్‌లో మోదీ, కీవ్‌ స్టార్మర్‌తో ‘చాయ్‌ పే చర్చ’, భారత్‌-యూకే సంబంధాలు బలోపేతం అవుతున్నాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఇద్దరు ప్రధానులకు చాయ్‌ అందించిన అఖిల్‌ పటేల్‌ ఎవరా? అని చర్చించుకోవడం మొదలైంది.

చెకర్స్‌... బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ నివాసం. అందులో ఓ టీ స్టాల్‌ ప్రత్యేకంగా ఏర్పాటైంది. మోదీ, స్టార్మర్‌ టీ తాగింది అక్కడే. ఇది అఖిల్‌ పటేల్‌కు చెందినది. ఈ క్రమంలో మోదీకి టీ ఒంపుతూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా టీ అందిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు అఖిల్‌ పటేల్‌.

ఇక అఖిల్‌ బ్రిటన్‌లో చాలా పెద్ద విద్యా సంస్థల నుంచి డిగ్రీలు పొందారు. అనంతరం చాయ్‌ దుకాణం తెరిచారు. బీఎస్సీని, ఎంబీఏను లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎల్‌ఎస్‌యూ) నుంచి సాధించాడు. ఇంటర్న్‌షిప్‌ల అనంతరం డేటా అనలిస్ట్‌గా చేరాడు. అయితే, ఏడేళ్ల కిందట లద్దాఖ్‌ పర్యటనలో స్థానికులు టీని ఓ ఆచారంగా తాగడం చూసి స్ఫూర్తి పొందాడు. అమలా పేరిట చాయ్‌ బ్రాండ్‌ను నెలకొల్పాడు.

దళారులు లేకుండా అసోం, కేరళ నుంచి సుగంధ ద్రవ్యాలను కొని వాడడం మొదలుపెట్టాడు. స్వయంగా ఆ రాష్ట్రాల్లో పర్యటించి రైతులతో మాట్లాడాడు. వారికే అధిక లాభాలు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తులను వాడాడు. దీంతో అఖిల్‌కు మంచి పేరొచ్చింది. బ్రిటిష్‌ మ్యూజియం అతడిపై ఓ వీడియో కూడా చేసింది. ఇంతకూ.. అఖిల్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా? అతడి బామ్మ.. వీరిద్దరి ఫొటో గత మే నెలలో బ్రిటిష్‌ మ్యూజియం ఇన్‌స్టా కవర్‌ గా ఉండడం విశేషం.

Tags:    

Similar News