'ముసలి నక్క'.. అనడం తప్ప నన్నేమీ చేయలేవు జగన్: చంద్రబాబు ఫైర్
నేనేమీ కేసుల కోసం పోరాటం చేయడం లేదు. మహా అయితే..నన్ను ముసలి నక్క అని తిడతావ్. తిట్టిస్తావ్. తిట్టుకో!;
వైసీపీ అధినేత, సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు. "నువ్వు నన్నేమీ చేయలేవ్. ప్రజల కోసం పోరాడుతున్నాను. నేనేమీ నీలాగా సొంత అవసరాల కోసం పోరాడడం లేదు. నాడు కేంద్రంతో గొడవపడినా.. ఇప్పుడు నీతో పోరాటం చేస్తున్నా.. నా స్వలాభం ఏమీ లేదు. నేనేమీ కేసుల కోసం పోరాటం చేయడం లేదు. మహా అయితే..నన్ను ముసలి నక్క అని తిడతావ్. తిట్టిస్తావ్. తిట్టుకో! అంతకు మించి నన్నేమీ చేయలేవ్. నా పోరాటం మాత్రం ప్రజలకోసమే. ఆపేది లేదు" అని చంద్రబాబు అన్నారు.
గంట సేపు కూర్చోలేవు!
''నేను పోరాడింది నా కోసమా..? నా పై ఉన్న కేసుల కోసమా..?.. నేను ప్రాజెక్టుల వద్దకెళ్తున్నా.. అక్కడే నిలదీస్తా... ప్రభుత్వం తప్పు చేస్తుందంటే తిడతారు.. అంతేగా.. ముసలి నక్కా అంటావ్.. ఇదే గా జగన్ చేయగలిగింది..?.. గట్టిగా ఓ గంట కూర్చొని ఫైల్ చూడలేవు. బూతులు తిట్టడం తప్ప ఏమైనా చేయగలరా..?'' అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
పోలవరం పై కలలు..
పోలవరం ప్రాజెక్టు కోసం తాను ఎన్నో కలలు కన్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి అయితే ఏపీ తో ఏ రాష్ట్రమూ పోటీ పడలేదని చెప్పారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల కు కూడా నీళ్లిచ్చే స్థాయికి చేరుకుంటామని వ్యాఖ్యానించారు. పేదల కు, రైతుల కు కలిగే లబ్ది పై ఎన్నో కలలు కన్నానని, పోలవరం పూర్తయితే.. రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని భావించానని, కానీ, మొత్తం నాశనం చేశాడని సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. ఐదేళ్లు వర్షాలు రాకున్నా.. ఏపీకి ఇబ్బంది లేని పరిస్థితి ఉండేదని అన్నారు.
69 పూలు..
'నా ఆకాంక్షను.. రాష్ట్ర భవిష్యత్తును' నాశనం చేశారని సీఎం జగన్ పై చంద్రబాబు ఫైరయ్యారు. 69 నదులు ఉన్నాయని, ఈ నదులను పూలుగా భావించానని, ఈ పూలను పోలవరం అనే దారంతో దండ చేయాలనుకున్నామని, ఆ దండను తెలుగుతల్లి మెడలో మణిహారంగా వేయాలనుకున్నామని చంద్రబాబు చెప్పారు. పోలవరం నిర్వాసితుల కోసం కేంద్రంతో వాదించానని.. ఏ సెక్షన్ కింద.. ఏ చట్టం కింద ఆర్ అండ్ ఆర్ ఇవ్వనంటున్నారని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.