వేలాది మంది మనో వేదనకు రూ.22.2 కోట్ల ఫైన్
అదంతా గత ఏడాదిలో దాని తీరుతో మొత్తం మారిపోవటమే కాదు.. దేశీయంగా తిరుగులేని అధిక్యతతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఇండిగో వైనం షాకింగ్ గా మాత్రమే కాదు.. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది.;
దేశంలోనే దిగ్గజ ఎయిర్ లైన్స్ సంస్థ. విమాన ప్రయాణం చేసే భారతీయుల్లో అత్యధికులు దేశీయంగా విమాన ప్రయాణాలు చేయాలని భావిస్తే..ఛాయిస్ లో ముందు వరుసలో ఉండటమే కాదు.. టికెట్ బుక్ చేసుకుంటే.. సమయానికి గమ్యానికి చేరిపోవటమే అన్నట్లుగా ఇండిగో ట్రాక్ రికార్డు ఉండేది. అదంతా గత ఏడాదిలో దాని తీరుతో మొత్తం మారిపోవటమే కాదు.. దేశీయంగా తిరుగులేని అధిక్యతతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఇండిగో వైనం షాకింగ్ గా మాత్రమే కాదు.. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది.
ఏడాది కంటే ముందే నిబంధనల్ని పక్కాగా పాటించాల్సిందేనన్న ప్రభుత్వ గడువును ఇంత లైట్ తీసుకోవటం.. లక్షలాది మంది ప్రయోజనాల్ని పణంగా పెట్టిన తీరు.. ఆ సంస్థపై అప్పటివరకున్న గౌరవ మర్యాదలు మొత్తం పోయే పరిస్థితి. నిత్యం వేలాది విమాన సర్వీసులు ఇట్టే రద్దైపోవటం.. అందుకు తగ్గట్లే భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోవటం ఒక ఎత్తు అయితే.. విమాన సర్వీసు రద్దు కారణంగా ఓవైపు మనో వేదన.. మరోవైపు ఆర్థిక.. కెరీర్.. భావోద్వేగ నష్టాలను ఎవరూ పూడ్చలేనంత భారీగా ఉండటం తెలిసిందే.
అంతర్గతంగా తాము చేసిన తప్పులకు లక్షలాది మంది ప్రయోజనాలు దెబ్బ తినేలా చేసిన ఇండిగో అలియాస్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ సంస్థకు ఫైన్ విధిస్తూ తాజాగా ప్రకటన వెలువడింది. గత ఏడాది ఇండిగో సంక్షోభ సమయంలో మూడు రోజుల వ్యవధిలో (డిసెంబరు 3-5 తేదీల్లో) 2507 విమానాలు రద్దు కాగా.. 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశ వ్యాప్తంగా వివిధ ఎయిర్ పోర్టుల్లో దాదాపు మూడు లక్షల మందికి పైనే ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి.
ఈ వ్యవహారంపై నలుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సదరు కమిటీ ఇండిగోకు జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణాళికా లోపాలు.. నిర్వహణ నియంత్రణ వైఫల్యాలు ఉన్నట్లుగా గుర్తించిన కమిటీ.. ఇండిగోకు రూ.22.2 కోట్ల మొత్తాన్ని ఫైన్ గా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జరిమానాకు సంబంధించిన ఉత్తర్వులను తాము డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి అందుకున్నట్లుగా ఇండిగో వెల్లడించింది. సకాలంలో తగిన చర్యలు చేపడతామని చెప్పింది. తనకు విధించిన జరిమానాను ఇండిగో చెల్లిస్తుందా? లేదా? అన్నది ఒక పాయింట్ అయితే.. ఇండిగో కారణంగా నష్టపోయిన లక్షలాది మంది మాటేమిటి? వారి ఇక్కట్లకు.. వారి ఆర్థిక నష్టానికి తూతూ మంత్రంగా పరిహారం చెల్లిస్తే సరిపోతుందా? అన్నది అసలు ప్రశ్న.