ఆ రెండు చోట్లా టీడీపీకి తిరుగులేదు.. వైసీపీ లెక్కేంటి...!

ఇక‌, పేట నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పోనుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్ సైతం.. నియోజ‌క‌వ‌ర్గానికి దూర‌మ‌య్యారు.;

Update: 2026-03-07 03:30 GMT

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి తిరుగులేద‌న్న టాక్ జోరుగా వినిపిస్తోంది. గుంటూరు పార్ల‌మెంటు స్థానంతోపాటు.. న‌ర‌స‌రావుపేట ఎంపీ స్థానంలోనూ టీడీపీకి బ‌ల‌మైన జోష్ క‌నిపిస్తోంది. గుంటూరు నుంచి విజ‌యం దక్కించుకున్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. అటు కేంద్ర మంత్రిగా ఉంటూనే ఇటు రాజ‌కీయంగా నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్నారు. పార్టీ నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉంటున్నారు.

ఇక‌, న‌ర‌స‌రావుపేట నుంచి విజ‌యం ద‌క్కించుకున్న లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు కూడా ఇదే పంథాను అనుస‌రిస్తున్నారు. ఇద్ద‌రు కూడా పార్టీలో అజాత శ‌త్రువులు కావ‌డం .. మ‌రో కీల‌క విష‌యం. దీనికి తోడు క‌మ్మ సామాజిక వ‌ర్గం అండ‌తోపాటు.. రాజ‌కీయంగా త‌మ‌కు ఎదురులేని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు.. ఎవ‌రు ఏ స‌మ‌స్య‌పై వ‌చ్చినా.. పార్టీల‌కు అతీతంగా ప‌నిచేస్తున్నారు. దీంతో ఇద్ద‌రు ఎంపీల‌కు.. ఎలాంటి సెగ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు.. వైసీపీ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌దిలేసింద‌న్న చ‌ర్చ‌ కూడా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మయంలో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన వైసీపీ నాయ‌కుడు కిలారి వెంక‌ట రోశ‌య్య‌.. ఓడిపోయారు. ఆ వెంట‌నే పార్టీ మారిపోయారు. పోనీ.. ఆ త‌ర్వాత వైసీపీ ఇక్క‌డ నాయ‌కుడిని నియ‌మించినా.. ఆయ‌న ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. విజ‌య‌వాడ ప‌శ్చిమ‌కు చెందిన పోతిన వెంక‌ట మ‌హేష్‌కు ఇక్క‌డ ఇంచార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. కానీ, ఆయ‌న కాలు క‌ద‌ప‌డం లేదు.

ఇక‌, పేట నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పోనుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్ సైతం.. నియోజ‌క‌వ‌ర్గానికి దూర‌మ‌య్యారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నెల్లూరు సిటీకి వెళ్లిపోయారు. దీంతో పేట‌లో వైసీపీ మాట వినిపించ‌డం ఆగిపోయింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నా.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఆ త‌ర‌హా.. నాయ‌కులు లేకుండా పోయారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి తిరుగులేద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News