స్వదేశానికి హసీనా.... మరణ శిక్ష ఖాయమా ?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన సొంత దేశ వెళ్ళాలని అనుకుంటున్నారు. ఈ విషయం ఆమె ఫ్రాన్స్‌కు చెందిన ఒక వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

Update: 2026-07-31 03:37 GMT

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన సొంత దేశ వెళ్ళాలని అనుకుంటున్నారు. ఈ విషయం ఆమె ఫ్రాన్స్‌కు చెందిన ఒక వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ లోకి అడుగు పెట్టేందుకు షేక్ హసీనా నిర్ణయించుకున్నారు. అయితే ఆమెకు అక్కడ ఉరి శిక్ష విధిస్తూ 2025లో ట్రైబ్యునల్‌ వెలువరించిన తీర్పు ఉంది. దాంతో షేక్ హసీనా ఆ దేశంలోకి అడుగు పెడితే ఏమి జరుగుతుంది అన్నది మాత్రం తెలియదు అనే అంటున్నారు. అయితే షేక్ హసీనా తన సొంత దేశం ఆరు నూరు అయినా వెళ్ళి తీరుతాను అంటున్నారు. తన మీద విధించిన ఉరి శిక్ష కూడా పూర్తిగా తప్పుడు తీర్పుగా ఆమె చెప్పారు. ఏది ఎలా ఉన్నా అన్నీ ఎదుర్కొంటాను అని ఆమె అంటున్నారు.

కఠిన స్వరంతో సర్కార్ :

షేక్ హసీనా ఈ ప్రకటన చేయడంతోనే బంగ్లాదేశ్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే కఠిన స్వరమే వినిపించింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ రావాలి కానీ అడుగు పెట్టిన వెంటనే అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ న్యాయ మంత్రి ఎం.అసదుజ్జమాన్‌ అంతా చట్ట ప్రకారమే నిర్ణయం ఉంటుందని అన్నారు. షేక్ హసీనా విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండే చాన్స్ లేదని అన్నారు.

ఆమెకు ఆ చాన్స్ లేదు :

మరో వైపు చూస్తే షేక్ హసీనా కోర్టులో నేరుగా లొంగిపోయే చాన్స్ అయితే ఏ మాత్రం లేదని ఎం.అసదుజ్జమాన్‌ అంటున్నారు. ఆమెకు మరణ శిక్ష విధించారు కాబట్టి ఆ అవకాశాలు లేవని అన్నారు. ఇక ఆమె బంగ్లా పౌరురాలే అయినప్పటికీ ఆమెకు సొంత దేశం వచ్చే హక్కు ఉన్నప్పటికీ ఆమె మీద ఉన్న కేసుల కారణంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తేల్చి చెబుతున్నారు.

పాస్ పోర్టు రద్దుతో :

ఇంకో వైపు చూస్తే షేక్ హసీనా పాస్ పోర్టుని అప్పటి మధ్యంతర ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ఆమె బంగ్లాదేశ్ లోకి ఏ విధంగా అడుగుపెడతారు అన్నది ఒక ప్రశ్న. అయితే అది ఆమె సొంత సమస్య అని ఎం.అసదుజ్జమాన్‌ అంటున్నారు. కానీ ఏ విధంగా దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని గట్టిగానే చెబుతున్నారు. ఇంతకీ ఆమె ఏ మార్గంలో వస్తారో అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేయడం విశేషం.

తెగించి మరీ అక్కడికి :

నిజానికి షేక్ హసీనా గడచిన రెండేళ్ళుగా భారత్ లో శరణార్ధిగా ఉంటున్నారు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ లో అతి పెద్ద ఉద్యమం చెలరేగింది. దాని పర్యవసానంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దాంతో ఆమె హుటాహుటిన భారత్ వచ్చి నాటి నుంచి ఇండియాలోనే ఒక సీక్రెట్ ప్రదేశంలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ లో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ ఆమెకు ఏకంగా మరణ శిక్షనే విధిచిది. అయితే తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఇది అని షేక్ హసీనా అంటున్నారు. ఇక హసీనా మాత్రమే కాదు ఈ తీర్పు మీద అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఈ తీర్పులో ఎన్నో లోపాలు ఉన్నాయని విమర్శించాయి. మరో వైపు చూస్తే ఇప్పటికి అనేక సార్లు బంగ్లాదేశ్ పాలకులు షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ని కోరాయి. కానీ భారత్ అప్పగించలేదు. అయితే తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెబుతోంది. ఈ క్రమంలో షేక్ హసీనా ఇప్పుడు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు.

అక్కడ ఉరి శిక్ష :

షేక్ హసీనా ఒక విధంగా తెగించే బంగ్లాదేశ్ కి వెళ్తున్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. తన వల్ల భారత్ ఇబ్బంది పడకూడదు అన్నది అందులో ఒకటి. రెండేళ్ళ నుంచి భారత్ లో ఆమె ఉంటున్నారు. మరో వైపు ఇలా ఎన్నాళ్ళు ఇక్కడ శరణార్ధిగా ఉంటామని కూడా ఆలోచిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఆనాడు విద్యార్ధి లోకం యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఇపుడు ఆ ఆగ్రహం చల్లారి ఉంటుందని భావిస్తున్నారు. తమ పార్టీ తరఫున లక్షాలాది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకుని పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి వైఖరిలో మార్పు ఉంటుందని ఊహిస్తున్నారు. ఒక వేళ మరణ శిక్ష విధించినా పోరాడాలని చూస్తున్నారు. ఆఖరుకు అది అమలు అయినా సొంత దేశంలోనే తన జీవితం పోరాటంలోనే ముగించాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాదాపుగా ఎనభయ్యేళ్ళ వయసులో ఉన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ కి సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలు అందించారు. ఆమెకు మరణ శిక్ష అమలు చేస్తే మాత్రం అది ప్రపంచంలోనే సంచలనం అవుతుంది. కొత్త ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News