మోడీ కేబినెట్ విస్తరణకు పెద్ద బ్రేక్....రీజన్ అదేనా ?

కెంద్ర మంత్రి వర్గం విస్తరణ అన్నది ఇప్పటి మాట కాదు. గత ఆరు నెలలుగా సాగుతూనే ఉంది. నిజానికి ఈ ఏడాది జూన్ 9తో మోడీ ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంది.

Update: 2026-09-22 00:30 GMT

కెంద్ర మంత్రి వర్గం విస్తరణ అన్నది ఇప్పటి మాట కాదు. గత ఆరు నెలలుగా సాగుతూనే ఉంది. నిజానికి ఈ ఏడాది జూన్ 9తో మోడీ ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంది. దాంతో ఆ సందర్భంగానే మంత్రివర్గంలో సమూలమైన మార్పులు చేర్పులు ఉంటాయని ఊహాగానాలు బయలుదేరాయి. దాని కోసం తెర వెనక కసరత్తు జరుగుతోంది అని కూడా జాతీయ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఆ తరువాత జెన్ జీ ఉద్యమం ఉధృతం కావడం జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షలతో ఏకంగా కేంద్ర వియా శాఖ మంత్రి బలమైన నేత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పరిస్థితులు దారి తీయడంతో తొలి అవాంతరం ఆ విధంగా ఎదురైంది.

వర్షాకాల సెషన్ తరువాత :

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తి అయిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కూడా ప్రచారం సాగింది. కొత్త మంత్రులు ఎవరు, ఉన్న వారిలో మాజీలు అయ్యేది ఎవరు అని కూడా విశ్లేషిస్తూ అనేక కధనాలు వచ్చాయి. అయితే పార్లమెంట్ సెషన్ ముగిసి నెల రోజులు పై దాటినా ఆ సూచనలు కూడా లేకుండా పోయింది. మోడీ ఈలోగా విదేశీ పర్యటన చేపట్టి వచ్చారు. ఆ తరువాత మంత్రి వర్గంలో భారీ మార్పులు అని అన్నారు. అయితే అది కూడా నిజం కాదని తేలిపోయింది. ఇక నెమ్మదిగా సెప్టెంబర్ నెల పూర్తి అవుతోంది అక్టోబర్ లో మంచి రోజులు కాబట్టి కచ్చితంగా విస్తరణ జరిగి తీరుతుందని ఇంకో ప్రచారం సాగుతూ వచ్చింది. ఇపుడు చూస్తే అది కూడా జరిగేందుకు అవకాశాలు లేవని అంటున్నారు. మరి ఎప్పటికి విస్తరణ జరుగుతుంది అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం పెద్దలకు మంత్రి వర్గంలో మార్పులు చేయాలని ఆలోచనలు ఉన్నాయా అన్నది కూడా మరో డౌట్ గా ముందుకు వస్తోంది.

మ్యాటర్ ఇదేనట :

అయితే ఈపాటికే మంత్రి వర్గ విస్తరణ జరిగిపోయేది కానీ ఈ మధ్యలో బీజేపీ జరిపించిన అంతర్గత సర్వేలో ఎంపీల పని తీరు మీద సంచలన విషయాలు బయటపడడంతోనే పార్టీ పెద్దలు అవాక్కు అయ్యారని అంటున్నారు. దాంతోనే విస్తరణ సంగతి తరువాత అని కూడా ఆగారని తెలుస్తోంది. ఇంతకీ ఈ సర్వేలో వెల్లడి అయిన విషయాలు తీసుకుంటే ఎక్కువ మంది ఎంపీల పనితీరు అయితే బాగా లేదని వచ్చిందని అంటున్నారు. పైగా వారంతా మోడీ ఇమేజ్ మీదనే ఇప్పటికీ ఆధారపడుతూ సొంత పలుకుబడిని ఎక్కడా పెంచుకోవడం లేదని అంటున్నారు. ఇక జెన్ జీ యువతతో ఎంపీలకు సంబంధాలు పెద్దగా లేవని మరో కఠోరమైన వాస్తవం బయటపడింది అని చెబుతున్నారు. ఇక ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పట్ల ప్రజా వ్యతిరేకత కూడా బాగా పెరిగిపోతోంది అని ఈ సర్వే షాకింగ్ న్యూస్ చెప్పింది అని అంటున్నారు. బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రజలకు మధ్య భారీ అంతరం ఏర్పడింది అని అంటున్నారు. ప్రభుత్వానికి జనాలకు మధ్య ఇదే రకమైన దూరం ఉందని చెబుతున్నారు.

తగిన జాగ్రత్తలతోనే :

ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రులను పక్కన పెట్టి కొత్తగా ఎంపీలలో కొందరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలనుకుని బీజేపీ పెద్దలు వేసుకున్న ప్రణాళికలు అయితే ఆగినట్లే అని చెబుతున్నారు. చాలా మంది ఎంపీలకు జనంతో నేరుగా సంబంధాలు బలంగా లేకపోవడంతో వారిని తెచ్చి కేంద్ర మంత్రులుగా చేస్తే మరింత వ్యతిరేకత మూటకట్టుకున్నట్లే అవుతుందని కూడా పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. దాంతో మరోసారి క్షేత్ర స్థాయిలో పరిస్థితి బీజేపీ ఎంపీల పని తీరుని పరిశీలించడానికి కొత్త పరిశీలనా బృందాన్ని బీజేపీ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ బృందం ఇచ్చే నివేదికల ఆధారంగానే బలమైన సమర్ధవంతమైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు అని అంటున్నారు. అంటే ఆలస్యం ఎంత అయినా పరవాలేదు కానీ ప్రజాదరణ తక్కువగా ఉన్న వారిని తెచ్చి కీలక పదవులు ఇస్తే చేదు అనుభవాలు ఎదురవుతాయని ఆలోచించే ఈ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పట్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు అయితే లేవనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News