యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి కన్నుమూత.. దుబాయ్‌లో 10 రోజుల సంతాపం
యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి దుబాయ్ పాలకుడైన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోదరుడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (76) సోమవారం తుదిశ్వాస విడిచారు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి దుబాయ్ పాలకుడైన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోదరుడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (76) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దుబాయ్ పాలకుల కోర్టు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆయన మృతి పట్ల ఎమిరేట్స్ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
10 రోజుల అధికారిక సంతాప దినాలు
షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి గౌరవసూచకంగా దుబాయ్ వ్యాప్తంగా 10 రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సంతాప కాలంలో దుబాయ్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక భవనాలు.. ఎమిరేట్ వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు.
తన సోదరుడి మరణంపై దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సోదరుడు భౌతికంగా తమ మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించిన సేవలు.. జ్ఞాపకాలు ఎప్పటికీ తమ ప్రార్థనల్లో.. హృదయాల్లో నిలిచిపోతాయని భావోద్వేగంగా పేర్కొన్నారు.
దుబాయ్ పురోగతిలో కీలక పాత్ర
దివంగత దుబాయ్ మాజీ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ కుమారుడైన షేక్ అహ్మద్, దుబాయ్ నగర అభివృద్ధిలో, పరిపాలనలో చురుగ్గా వ్యవహరించారు. ప్రజా జీవితం, భద్రత, సైనిక వ్యవహారాలు, వ్యాపార రంగం, క్రీడల్లో ఆయన సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించారు. యుకేలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్' లో విద్యాభ్యాసం పూర్తి చేసిన షేక్ అహ్మద్, స్వదేశానికి తిరిగి వచ్చి దుబాయ్ సైనిక విభాగంలో సేవలందించారు. అనంతరం దుబాయ్ పోలీస్, పబ్లిక్ సెక్యూరిటీ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి నగర భద్రతను పటిష్టం చేయడంలో ముద్ర వేశారు. క్రీడల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా గుర్రపు పందేల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రముఖ 'జెబెల్ అలీ రేస్‌కోర్స్' రూపకల్పనలో, దుబాయ్‌లోని 'అల్ వసల్ స్పోర్ట్స్ క్లబ్' ఎదుగుదలలో ఆయన పాత్ర ప్రశంసనీయం. పాలనా వ్యవహారాలతో పాటు రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వ్యాపార రంగాలలో ఆయన సాధించిన పురోగతి దుబాయ్ ఆర్థిక రంగానికి ఊతమిచ్చింది.
విచారం వ్యక్తం చేసిన యూఏఈ అధ్యక్ష భవనం
షేక్ అహ్మద్ మృతి పట్ల యూఏఈ అధ్యక్ష భవనంతో పాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు, ఎమిరేట్స్ నివాసులు తీవ్ర సంతాపం తెలిపారు. అల్ మక్తూమ్ రాజకుటుంబానికి.. దుబాయ్ ప్రజలకు తమ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దుబాయ్ ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.