తెలంగాణలో కొత్త పత్రిక.. కొత్త రాజకీయ సమీకరణాలు.. మరెన్నో ఊహాగానాలు!

అయితే ఈ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గంలో ఉన్న ముఖ్యులకు రెండు ప్రధాన పార్టీలతో సంబంధాలు ఉండటమే ఉత్కంఠకు కారణమవుతోంది.

Update: 2026-09-21 16:18 GMT

తెలుగునాట మరో కొత్త పత్రిక పురుడుపోసుకుంటోందన్న సమాచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా తెలంగాణ వేదికగా పనిచేయనున్న ఈ కొత్త పత్రిక ప్రధాన రాజకీయ అజెండాపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగునాట ప్రస్తుతం ఎన్నో పత్రికలు ఉండగా, దాదాపు ప్రధాన పత్రికలు అన్నింటికి ఏదో ఒక రాజకీయ పార్టీతో అనుబంధం ఉందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రారంభించనున్న కొత్త పత్రిక రాజకీయ అజెండా ఏంటి అన్న చర్చ కూడా ఎక్కువగా జరుగుతోంది. అయితే ఈ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గంలో ఉన్న ముఖ్యులకు రెండు ప్రధాన పార్టీలతో సంబంధాలు ఉండటమే ఉత్కంఠకు కారణమవుతోంది.

డిజిటల్ మీడియా హవా ఎక్కువగా ఉన్న ప్రస్తుత కాలంలో ప్రింట్ మీడియాలో ఒక పత్రిక తీసుకువచ్చే సాహసం చేస్తుండటమే ఎక్కువ మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నష్టాలే ఎక్కువగా ఉండే ఈ రంగాన్ని కొత్త పత్రిక యాజమాన్యం ఎందుకు ఎంచుకుంది? అన్న ప్రశ్న అనేక సందేహాలకు తావిస్తోంది. రాజకీయ అజెండాను ప్రచారం చేయడం కోసమే ఈ ప్రతిక తీసుకువస్తున్నారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అయితే కొత్త పత్రిక యాజమాన్యం, సంపాదకవర్గంలో భిన్న రాజకీయ అభిరుచులు ఉన్న వ్యక్తులు ఉండటంతో వారి అజెండాపై క్లారిటీ దొరకడం లేదని చెబుతున్నారు.

ముఖ్యంగా కొత్త పత్రిక యాజమాన్యంలోని ప్రముఖుడికి ఇప్పటికే తెలుగు మీడియాలో ప్రధాన పత్రిక నడుపుతున్న ఒక ముఖ్యుడితో దగ్గర బంధుత్వం ఉండటం వల్ల కొత్త పత్రిక పుట్టుకపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ప్రధాన మీడియా గ్రూపుగా ఉన్న పత్రికా యాజమాన్యం ఏపీ రాజకీయలపై ఎక్కువగా ఫోకస్ చేయడం, ఆ పత్రిక ఏపీకే పరిమితం అన్న భావన పెరిగిపోతుండటం వల్ల ముందస్తు జాగ్రత్తగా ఆ పత్రికా యాజమాన్యమే తెలంగాణలో కొత్త పత్రిక తీసుకువస్తుందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇదే సమయంలో ఈ కొత్త పత్రిక అధికార కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పనిచేయడానికి పురుడు పోసుకుంటోందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఇంతవరకు ఏ పత్రిక లేకపోవడంతో ఈ పత్రిక తీసుకువస్తున్నారని చెబుతున్నారు.

ఇక ఈ పత్రిక యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఒక టీవీ చానల్ లో గతంలో భాగస్వామ్యం ఉండేదని ఒక ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ముఖ్యనేత ప్రోద్బలంతోనే ఈ కొత్త పత్రిక తీసుకువస్తున్నారని అంటున్నారు. మరోవైపు పత్రిక సంపాదకవర్గంలో ఒక ముఖ్యుడికి బీఆర్ఎస్ అధిష్టానంతో దగ్గర సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కోసమే ఈ కొత్త పత్రిక పనిచేయనుందనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రముఖ నేతకు సమీప బంధువు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పదవి పొందిన ప్రముఖ జర్నలిస్టు సంపాదక వర్గంలో ప్రధాన పాత్ర పోషించడం వల్ల కొత్త పత్రిక గులాబీ పార్టీకి అనుబంధం అన్న ప్రచారానికి ఊతమిస్తోందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ వేదికగా త్వరలో వెలువడనున్న పత్రిక రాజకీయ అజెండాపై జరుగుతున్న చర్చ తీవ్ర ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News