కారుమూరిని కొట్టొద్దు.. క‌స్ట‌డీ ఆదేశాల్లో కోర్టు స్ప‌ష్టం!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావును క‌స్ట‌డీకి ఇచ్చిన కోర్టు.. ఆయ‌న‌పై భౌతికంగా ఎలాంటి హెరాష్ మెంటు చేయ‌రాద‌ని పోలీసుల‌కు తేల్చి చెప్పిన‌ట్టు కారుమూరి త‌ర‌ఫు లాయ‌ర్ మీడియాకు చెప్పారు.

Update: 2026-09-21 16:22 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావును క‌స్ట‌డీకి ఇచ్చిన కోర్టు.. ఆయ‌న‌పై భౌతికంగా ఎలాంటి హెరాష్ మెంటు చేయ‌రాద‌ని పోలీసుల‌కు తేల్చి చెప్పిన‌ట్టు కారుమూరి త‌ర‌ఫు లాయ‌ర్ మీడియాకు చెప్పారు. తాజాగా కారుమూరిని ఈడీ అధికారులు త‌మ అధీనంలోకి తీసుకున్నారు. ఇటీవ‌ల కోర్టు కస్ట‌డీ విచార‌ణ‌కు అనుమతి ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌ను సోమ‌వారం అదుపులోకి తీసుకున్న అధికారులు.. హైద‌రాబాద్‌లోని త‌మ కార్యాల‌యానికి త‌ర‌లించారు.

అయితే.. దీనికి ముందు.. కారుమూరి త‌న‌ను అన్యాయంగా ఇరికించార‌ని.. ఇంత‌కు ఇంత అనుభ‌విస్తార‌ని వ్యాఖ్యా నించారు. ఎవ‌రి పేర్లూ చెప్ప‌కుండానే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అస‌లు లిక్క‌ర్ లో స్కామే జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఢిల్లీలో జ‌రిగింద‌ని చెప్పిన‌.. లిక్క‌ర్ స్కామ్ అస‌లు స్కామే కాద‌ని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇక్క‌డ కూడా అలానే జ‌రుగుతుంద‌న్నారు. కేవ‌లం వైసీపీ నాయ‌కులం కావ‌డం వ‌ల్లే త‌మ‌పై క‌క్ష పూరిత రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

క‌స్ట‌డీలో త‌న‌ను హింసించాల‌ని.... కొట్టాల‌ని ఓ మంత్రి చెప్పిన‌ట్టు స‌మాచారం అందింద‌ని కారుమూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. త‌నను ఏం చేసినా.. నిజాలు మాత్రం దాచ‌లేర‌న్నారు. అస‌లు అక్ర‌మాలే లేవ‌ని చెబుతున్నా.. అధికారులు వినిపించుకోవడం లేద‌న్నారు. లేనిది ఉన్న‌ట్టుగా భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఎదురు దాడి చేశారు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారిని వ‌దిలి పెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాజకీయంగా త‌న‌తో పోరాడే శ‌క్తిలేని వారు ఇలా చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

జైలువ ద్ద హంగామా..

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో కారుమూరి, ఆయ‌న త‌న‌యుడు కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటు న్నారు. లిక్క‌ర్ సీసాల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లించే కాంట్రాక్టును వీరు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే 15 కోట్ల రూపాయ‌ల మేర‌కు అవినీతికి పాల్ప‌డ్డార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలో కోర్టు ఆదేశాల‌తో చెంచ‌ల్ గూడ జైలులో ఉన్న కారుమూరిని అదుపులోకి తీసుకుని.. త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున హంగామా చేశారు. త‌ణుకు నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు.

Tags:    

Similar News