విజయ్ కాళ్ళ కింద పల్లేరు ముళ్ళు...స్టాలిన్ పక్కా ప్లాన్ !

విజయ్. వెండి తెర మీద దళపతి, తిరుగులేని సూపర్ స్టార్. అయితే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు.

Update: 2026-09-22 01:30 GMT

విజయ్. వెండి తెర మీద దళపతి, తిరుగులేని సూపర్ స్టార్. అయితే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. టీవీకే పార్టీని తొలిసారి 2026 ఎన్నికల బరిలోకి నిలిపి మొదటి ప్రయత్నంలోనే అధికారం పట్టేశారు. ఆ రేర్ ఫీట్ సాధించిన వారిలో ఎంజీఆర్ ఎన్టీఆర్ ల సరసన అలా చేరిపోయారు. అయితే రాజకీయాల్లోకి స్థిరపడేనాటికి ఎంజీఆర్ ఎన్టీఆర్ ఆరు పదుల వయసులో ఉన్నారు. వారు ఎన్నో అనుభవాలను అప్పటికే చూశారు. దాంతో ఎంతో కొంత తట్టుకోగలిగారు. విజయ్ విషయం తీసుకుంటే ఆయన చాలా ఎర్లీగానే పాలిటిక్స్ లోకి వచ్చారు. 52 ఏళ్ళ వయసులో సీఎం అయ్యారు. రాజకీయ అనుభవం తక్కువే. ఇదే ఇపుడు ఆయనకు ఇబ్బందిగా మారుస్తూ విపక్షాలు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నాయి.

టఫ్ టాస్క్ తోనే :

ఇక పోతె ఎంజీయార్ 1977లో తొలిసార్ తమిళనాడు సీఎం అయ్యేనాటికి విపక్షంలో ఒక్క డీఎంకే మాత్రమే ఉంది. ఇపుడు విజయ్ సీఎం గా పనిచేస్తున్న వేళ అటు అన్నా డీఎంకే ఇటు డీఎంకే రెండూ విపక్షంలో ఉన్నాయి. రెండు బలమైన ద్రవిడ పార్టీలతో ఒకేసారి పోరాటం చేయడం అంటే టఫ్ టాస్క్ గానే చూస్తున్నారు. అవలీలగా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను పక్కకు నెట్టగలిగిన విజయ్ కి దైనందిన పరిపాలనలో మాత్రం విశేష అనుభవంతో ఆ రెండు పార్టీలు వేస్తున్న ఎత్తులు తట్టుకోవడం అంటే బహు కష్టంగానే ఉంది అని అంటున్నారు. పైగా రెండు పార్టీలు సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నాయి. దాంతో కొత్తగా సీఎం అయిన విజయ్ దూకుడుకు ఎక్కడ బ్రేకులు వేయాలో చూసి మరీ వేస్తున్నాయని అంటున్నారు.

హామీ మూన్ పీరియడ్ లేదా :

నిజానికి ఏ కొత్త ప్రభుత్వానికి అయినా తొలి ఆరు నెలల పాటు హామీ మూన్ పీరియడ్ గా ఉంటుంది. విపక్షాలు కూడా వాటి మానాన వదిలేస్తాయి. ఆరు నెలల తరువాతనే నెమ్మదిగా విమర్శలు మొదలెడతాయి. కానీ విజయ్ కి ఆ అదృష్టం అయితే లేకుండా పోయింది అని అంటున్నారు. మొదటి రోజు నుంచే విజయ్ ని అడ్డుకునే ప్రయత్నం రెండు ద్రవిడ పార్టీలు చేస్తున్నాయని అంటున్నారు. ఇక అసెంబ్లీలో బలమైన విపక్షంగా డీఎంకే ఉంది. ఆ తరువాత ప్లేస్ లో అన్నా డీఎంకే ఉంది. ఈ రెండు పార్టీలు అసెంబ్లీ బయటా లోపలా విజయ్ ప్రభుత్వం తీరుని గట్టిగానే ఎండగడుతున్నాయి అని అంటున్నారు. దాంతో ఉక్కిరి బిక్కిరి కావడం కొత్త ముఖ్యమంత్రి వంతు అవుతోంది. కేవలం అధికారంలోకి వచ్చి నాలుగు నెలల కాలానికే విజయ్ టీవీకే ప్రభుత్వానికి డీఎంకే చుక్కలు చూపిస్తోంది అని అంటున్నారు.

విజయ్ కలలకు షాక్ :

ఇదిలా ఉంటే విజయ్ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని 1200 కోట్ల రూపాయలతో నిర్మించాలని తలపెట్టింది. అది మరో వందేళ్ళ పాటు గుర్తుండిపోయేలా భారీ ప్రాజెక్ట్ గా చేపట్టాలని చూస్తోంది. ఈ విధంగా కొత్త సచివాలయం శాసనసభ సముదాయాన్ని అద్భుతంగా నిర్మించాలని విజయ్ తలపెడుతున్నారు. చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని పట్టినాపక్కంలోని శ్రీనివాసపురం వద్ద ఈ బిగ్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలని చూస్తున్నారు. అయితే దీనిని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏకంగా తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల ఉపాధి పోతుందని సెంటిమెంట్ రాజేస్తోంది. మత్య్సకారుల పేరుతో జరిగే ఉద్యమాలకు పూర్తి మద్దతు ఇస్తామని అంటోంది.

సముద్రాన్ని చూస్తూ కూర్చోవడానికేనా :

అంతే కాదు సచివాలయం అంటే ఉన్నది పనిచేయడానికే కానీ ఎదురుగా సముద్రాన్ని చూస్తూ కూర్చోవడానికి కాదు అని డీఎంకే అధినేత స్టాలిన్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని సంహరించుకోకపోతే మత్స్యకార సంఘాలతో కలసి భారీ ఉద్యమాన్ని చేపడతామని ఆయన విజయ్ సర్కార్ ని హెచ్చరించారు. అంటే విజయ్ ప్రభుత్వం పని చేసేది కాదు సరదా కోసమే కొత్త సచివాలయం అన్న అర్థం వచ్చేలా ఆయన సెటైర్లు పేల్చారని అంటున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న పాత సచివాలయం ఇరుకుగా ఉందని పైగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని భావించి విజయ్ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్ట్ ని ప్రతిపాదిస్తోంది. అయితే దానికి మోకాలడ్డడం ద్వారా విజయ్ ముందర కాళ్ళకే డీఎంకే బంధం వేసిందని దానికి మత్స్యకారుల ఉపాధి పోతోంది అని సెంటిమెంట్ ని రాజేసిందని అంటున్నారు. మరి విజయ్ దీనిని ఏ విధంగా ఎదుర్కొని ముందుకు సాగుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News