మాచర్ల పొలిటికల్ సీన్ మారుతోందా..!
పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గం మాచర్ల మున్సిపల్ రాజకీయం తీవ్ర ఉత్కంఠభరితంగా ఉందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గం మాచర్ల మున్సిపల్ రాజకీయం తీవ్ర ఉత్కంఠభరితంగా ఉందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య బల ప్రదర్శనగా ఈ ఎన్నికలు మారుతున్నాయి. గతంలో ఏకపక్షంగా సాగిన ఇక్కడి మున్సిపల్ పీఠంపై పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ప్రస్తుత మాచర్ల మున్సిపల్ రాజకీయ ముఖచిత్రం, సమీకరణాలపై నియోజకవర్గం వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
గత 2021 మున్సిపల్ ఎన్నికలలో మాచర్లలోని మొత్తం 31 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుం ది. ఆ సమయంలో విపక్షాలకు నామినేషన్లు వేసే అవకాశం కూడా దక్కలేదనే విమర్శలు వచ్చాయి. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మానందరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించాక ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కీలక నేతలు కూటమి వైపు మొగ్గు చూపారు.
మరికొందరు వైసీపీ నేతలు తటస్థంగా మారిపోయారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గం అంటూ... ప్రత్యేకంగా ఇప్పుడు లేకపోవడంతో నియోజకవర్గంలో వైసీపీ ఎదురు గాలిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంతో ఉన్న టీడీపీ, స్థానిక శాసనసభ్యుడు జులకంటి బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీపై పూర్తి పట్టు సాధించాలని చూస్తోంది. గతంలో కోల్పోయిన కేడర్‌ను బలోపేతం చేసుకుంటూ వార్డులవారీగా పటిష్టమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది.
మరోవైపు టీడీపీకి మద్దతు ఇచ్చేలా.. జనసేన పార్టీ కూడా మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమరానికి గట్టిగా సన్నద్ధమవుతోంది. స్థానిక సమస్యలపై పోరాడుతూ, కూటమి అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభావం గతంలో బలంగా ఉండేది. అయితే 2024 లో ఎదురైన ఓటమి, ఆ తర్వాతి పరిణామాల వల్ల వైసీపీ ప్రస్తుతం ఇక్కడ డీలా పడింది.
కోల్పోయిన పూర్వ వైభవాన్ని దక్కించుకోవడానికి, మున్సిపల్ ఎన్నికల ద్వారా తిరిగి పుంజుకోవాలని పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. రాష్ట్ర ఎన్నికల సంఘం మాచర్లతో సహా 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తమ అనుకూల ఓటు బ్యాంకును పెంచుకునేందుకు టీడీపీ రెడీకాగా.. వైసీపీ నేతలు.. మౌనంగా ఉన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో పిన్నెల్లి చిక్కుకున్న నేపథ్యంలో ఆయన వర్గం దూకుడుకు బదులుగా.. మౌనంగా ఉండడం గమనార్హం.