నెల్లిమర్ల 'స్థానికం' హీటెక్కింది.. !
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మునిసిపాలిటీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది.
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మునిసిపాలిటీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. ప్రస్తుతం అధికార కూటమి (జనసేన-టీడీపీ) సమన్వయ సవాళ్లు, ప్రతిపక్ష(ప్రధాన కాదు) వైసీపీలో జరుగుతున్న సంస్థాగత మార్పుల చుట్టూ తిరుగుతోంది. నెల్లిమర్ల ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే.. కూటమి దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థి లోకం నాగ మాధవి భారీ మెజారిటీతో విజయం సాధించా రు. అయితే.. మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల్లో, నియోజకవర్గ పరిధిలోని స్థానిక కార్యక్రమాల్లో మాధవికి, టీడీపీ సీనియర్ నాయకులకు మధ్య వివాదాలు ఉండడం కూడా స్థానిక ఎన్నికలను హీటెక్కిస్తోంది.
ముఖ్యంగా టీడీపీ నేత, మాజీ ఇన్-ఛార్జ్ బూడి వెంకట రమణ వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రోటోకాల్ విషయంలో జరిగిన వివాదం రాష్ట్ర స్థాయి అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లింది. ఇవి స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ప్రతిపక్ష వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
సుదీర్ఘకాలంగా నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీకి నాయకత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయు డు స్థానంలో, పార్టీ అధిష్ఠానం ఇటీవల గడల సన్యాసి నాయుడును ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ హఠాత్ పరిణామం స్థానిక వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించడంతో పాటు నెల్లిమర్లపై పార్టీ అధినేత ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. అయినప్పటికీ.. శ్రేణుల్లో అయితే.. కలవరం కనిపిస్తోంది.
2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ వార్డులు(20 వార్డుల్లో 11) గెలుచుకుని మునిసిపాలిటీ పీఠాన్ని దక్కించు కుంది. బంగారు సరోజిని చైర్‌పర్సన్‌గా, సముద్రపు రామారావు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే దూకుడుగా ఉండడం వైసీపీకి కళ్లెం వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మేయర్లు/చైర్మన్ల ఎన్నిక విధానం ప్రత్యక్షంగా ఉంటున్న నేపథ్యంలో నెల్లిమర్ల మునిసిపాలిటీలో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా చూస్తే, అధికార పక్షంలో సీటు తమదంటే తమదనే అంతర్గత ఆధిపత్య పోరు నడుస్తుండగా, ప్రతిపక్ష వైసీపీ కొత్త నాయకత్వంతో క్యాడర్‌ను పుంజుకునేలా చేసే ప్రయత్నాల్లో ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడి అభివృద్ధి, రహదారుల అనుసంధానత వంటివి కూటమికి కలిసి రానున్నాయి. పైగా.. విజయనగరంలో తాజాగా మజ్జి శ్రీను.. టీడీపీ చెంతకు చేరడం కూడా.. కూటమికి కలిసివస్తోందని అంటున్నారు.