మండలి కి ఫైర్ బ్రాండ్స్.. బాబు ఎంపికపై ఉత్కంఠ.. !
ఏపీ శాసన మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటాలో ఎంపికైనా.. పందుల రవీంద్ర, జకియా ఖానంల పదవీ కాలం సోమవారంతో ముగిసింది.
ఏపీ శాసన మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటాలో ఎంపికైనా.. పందుల రవీంద్ర, జకియా ఖానంల పదవీ కాలం సోమవారంతో ముగిసింది. దీంతో అధికార పార్టీ కే ఈ రెండు స్థానాలు దక్కనున్నాయి. అయితే.. ఈ రెండు స్థానాల కోసం.. ఐదారుగురు బలమైన పోటీ ఇస్తున్నారు. కులాలు, సామాజిక ఆర్ధిక పరిస్థితులను అంచనా వేసుకున్న కొందరు నాయకులు... ఈ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది.
ఇక, ఈ రెండు స్థానాలను మిత్రపక్షాలకు కాకుండా.. రెండూ తామే తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే చెప్పారు. దీంతో మరింత పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు.. సామాజిక వర్గాల పరంగా బలంగా ప్రభావం చూపించే నాయకులు.. అదే విధంగా గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినవారు.. ఇలా.. అనేక కోణాల్లో నాయకులు లెక్కలు వేసుకుని.. ఈ సీట్లను దక్కించుకునే ప్రయత్నం లో ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీకి కావాల్సింది.. వీరికంటే కూడా.. ఫైర్ బ్రాండ్స్..!
అసెంబ్లీలో టీడీపీకి 135 మంది సభ్యులు ఉన్నారు. దీంతో బలమైన గళం వినిపించేందుకు అవకాశం ఉంది. పైగా వైసీపీ సభకే రావడం లేదు. ఉన్న 11 మంది కూడా సభకు రాకపోవడంతో అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి ఎదురు లేకుండా పోయింది. అదే సమయంలో మండలిలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వైసీపీకి 33 మంది సభ్యులు ఉండడంతో మొత్తం 58 మంది సభ్యుల్లో వీరిదే పైచేయిగా మారింది. దీంతో కీలకమైన బిల్లులు వీగిపోతున్నాయి.
ఉదాహరణకు పార్టీ నేత తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన బిల్లు మండలిలో వీగిపోయింది. అలాగే పీపీపీ విధానంలో ప్రైవేటు కు మెడికల్ కాలేజీలను అప్పగించే విషయం కూడా మండలిలో దుమారం రేపింది. ఇలాంటి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేం దుకు.. ఫైర్‌బ్రాండ్ వంటి నాయకుల అవసరం టీడీపీకి ఏర్పడింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మను పంపించారు. గతంలో మహానాడు వేదికగా వైసీపీ నేతలపై తొడకొట్టిన నేపథ్యంలో ఆమెను పంపించడం గమనార్హం.
కానీ, ఆమె అనుకున్న విధంగా దూకుడు చూపించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో అంతకు మించి ఫైర్ ఉన్న నాయకులను మండలికి పంపించాల్సిన అవసరం పార్టీకి ఏర్పడింది. ఈ క్రమంలో ఫైర్‌బ్రాండ్స్ ను పంపించాలస్న సూచనలను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్టు నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత చెప్పినా.. చెప్పకపోయినా.. వైసీపీ పై నిప్పులు చెరిగే స్థాయిలో ఉన్న నాయకులు అయితే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. ఈ కోణంలో కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. మరి ఎవరిని ఎంపిక చేస్తారన్నది చూడాలి.