ఎంపీ అరుణ మాటకు సీఎం రేవంత్ ఆన్సర్.. రాజకీయాలు ఇలా ఉండాలి

రాజకీయాల్లో ఘర్షణ చాలా ముఖ్యం. వైరుధ్య భావజాలం ఉన్నోళ్లు ఒకే వేదిక మీద కలిసినప్పుడు వారి మధ్య వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి.;

Update: 2026-01-18 05:25 GMT

రాజకీయాల్లో ఘర్షణ చాలా ముఖ్యం. వైరుధ్య భావజాలం ఉన్నోళ్లు ఒకే వేదిక మీద కలిసినప్పుడు వారి మధ్య వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. దూషణలకు దూరంగా వ్యవహరిస్తూ.. మాట్లాడే మాటలు చూసినప్పుడు రాజకీయ వైరం ఉన్నప్పుటికి ఒకలాంటి స్నేహపూర్వక వాతావరణం కొట్టొచ్చినట్లుగా కనిపించేది. గడిచిన కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పరిస్థితులు లేకుండా పోయాయి.

ఇలాంటి వేళ.. తాజాగా ఒక సన్నివేశం అందరిని ఆకర్షించటమే కాదు.. రాజకీయం అంటే ఇలా ఉండాలి కదా? అన్న భావన కలుగక మానదు. జడ్చర్ల మండలంలో ట్రిపుల్ ఐటీ భవనానికి భూమిపూజ చేసే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మొదట మాట్లాడిన డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘పాలమూరు డెవలప్ మెంట్ లో ముఖ్యమంత్రి బాధ్యత పెద్దది. వాస్తవంగా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం.. ఇక్కడ కూర్చున్న వారంతా నన్ను ఓడగొట్టేందుకు గట్టిగా పని చేసిన వాళ్లే’ అన్నంతనే అక్కడంతా నవ్వులు విరబూశాయి.

తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఎన్నికలు అయిపోయాయి. పాలమూరు డెవలప్ మెంట్ లక్ష్యంగా పని చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణ వ్యాఖ్యలకు తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘అరుణమ్మ చెప్పింది నిజమే. దాపరికం లేదు. నేను నిలబడితే నాలుగు సమావేశాలు పెట్టేవాడిని. వంశీచంద్ ను గెలిపించుకునేందుకు అరుణమ్మను ఓడగొట్టేందుకు పద్నాలుగు సమావేశాలు నిర్వహించా. కానీ.. ప్రజలు ఆశీర్వదించి ఆమెను గెలిపించారు. ఎన్నికల తర్వాత రాజకీయాల్లేవు. కుట్రలు.. కుతంత్రాలు లేవు. దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మహబూబ్ నగర్ ఎంపీ అరుణమ్మ. రాష్ట్రంలో మేమున్నాం. కేంద్రంలో వారు ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం కలిసిమెలిసి ముందుకెళ్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు

ఈ తరహా ఉదంతాలు చూసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి అహంకారం.. ప్రత్యర్థి పార్టీల పట్ల నిర్లక్ష్యంతో పాటు.. ఎన్నికల్లో తమ ఓటమిని ముఖ్యమంత్రే స్వయంగా ఒప్పుకోవటం లాంటివి అందరినిఆకట్టుకునేవిగా ఉంటాయని చెప్పాలి. రాజకీయ వైరం ఎన్నికల వరకే తప్పించి.. ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రజా సంక్షేమం.. డెవలప్ మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయాలన్న తీరు అందరిని ఆకట్టుకునేలా చేస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News