ఇదేం తీరు వాసంశెట్టి? ఇప్పుడు మీరు మంత్రిగారు సార్!
సామాన్యుడికి అసమాన్యుడికి తేడా ఒక అక్షరమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అలానే సాదాసీదా మనిషికి.. అలాంటి కోట్లాది మందికి రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించే నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది;
సామాన్యుడికి అసమాన్యుడికి తేడా ఒక అక్షరమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అలానే సాదాసీదా మనిషికి.. అలాంటి కోట్లాది మందికి రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించే నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులోనూ బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు.. ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాలకు హాజరైనప్పుడు తమ తీరుతోనూ.. నడవడికతోనూ వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇవ్వకూడదు.
కానీ.. ఏపీ కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీవీ ఆర్టిస్టులు.. నటీమణులతో డ్యాన్సులేంటి? మంత్రిగా వ్యవహరించాల్సిన అప్రమత్తత ఏ మాత్రం కనిపించలేదన్న అపప్రదను మూటగట్టుకున్న పరిస్థితి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసంశెట్టి.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు.
రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరుతో మ్యూజికల్ నైట్ లు.. రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. దీనికి పలువురు టీవీ నటీమణులతో పాటు.. టీవీల్లో వివిధ కార్యక్రమాల్లో నటించే వారితో కలిసి మంత్రివర్యులు డ్యాన్సులు వేయటం గమనార్హం. దాదాపు పండుగ సాగిన మూడు రోజులు ఆయన ఇదే తీరును ప్రదర్శించారు.
ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మంత్రి వాసంశెట్టి మాత్రమే కాదు.. ఆయన తండ్రి వాసంశెట్టి సత్య సైతం సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో డ్యాన్సులు వేసి అలరించారు. అయితే.. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి.. ఇలా చేయటాన్ని తప్పు పడుతున్నారు. అయితే.. తమ మీద వస్తున్న విమర్శల్ని మంత్రి వాసంశెట్టి లైట్ తీసుకుంటున్నారు. తాను మంత్రిని అయినా.. ఎమ్మెల్యే అయినా తాను తన మాదిరే ఉంటానని.. అంతే తప్పించి తన తీరును మార్చుకునే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టేస్తున్నారు. ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు రికార్డు డ్యాన్సులే వేయలా? అంతుకు మించి వేరే మార్గం లేదా మంత్రివర్యా? అన్న ప్రశ్నలు పలువురు సంధిస్తున్నారు.