ఆటో తగిలిందని.. స్థంబానికి కట్టేసి బీర్ బాటిళ్లతో దాడి
అలాంటి ఉదంతమే ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని పామూరు మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం.. తాజాగా ఆ దుర్మార్గ ఘటనకు సంబంధించిన వీడియో బయటకురావటంతోనే సాధ్యమైంది.;
చిన్న ఉదంతాలకు సైతం దుర్మార్గంగా వ్యవహరించటం.. చదివినంతనే ఒళ్లు వణికేలా దౌర్జన్యాలకు పాల్పడే వైనాల్ని చూసినప్పుడు.. ఇలాంటి వారి విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఉదంతమే ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని పామూరు మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం.. తాజాగా ఆ దుర్మార్గ ఘటనకు సంబంధించిన వీడియో బయటకురావటంతోనే సాధ్యమైంది. అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని గుంటుపల్లికి చెందిన మహర్షి ఆటో నడుపుతూ ఉంటాడు. నిమ్మకాయల లోడ్ తో తమ మండలానికి చెందిన బొట్లగూడురుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో తన ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో.. నడిచి వెళుతున్న తిరుపతయ్య అనే వ్యక్తికి తన ఆటోను తాకించాడు. దీంతో.. స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన తిరుపతయ్య స్నేహితులు, బంధువులు పలువురు కలిసి మహర్షి జుట్టు పట్టుకొని అతడి చొక్కా విప్పేసి.. అక్కడున్న ఒక రాడ్ కు కట్టేశారు.
ఆ తర్వాత నుంచి అతడిపై దారుణ రీతిలో దాడి చేయటం మొదలుపెట్టారు. బీరు సీసాలు.. కర్రలతో దాడులకు దిగారు. వీరి ఆరాచకాన్ని అక్కడే ఉన్న ఒక యువకుడు తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో పెను సంచలనంగా మారింది. తమ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడి ఇంటికి వెళ్లి అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం వీడియోలో ఉన్న ఆటో డ్రైవర్ ను సంప్రదించిన పోలీసులు అతడి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకొని.. కేసు నమోదు చేశారు. మొత్తం పది మంది నిందితుల్లో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు. ఎంత ఆటో తగిలితే మాత్రం.. మరీ అంత దారుణంగా దాడి చేయటమా?