తెలంగాణలో శాంతికే చోటు.. హింసకు కాదు: రేవంత్‌రెడ్డి
తెలంగాణ గడ్డపై అందరూ శాంతియుతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని, హింసాత్మక వాదనలకు, హింసలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.;
తెలంగాణ గడ్డపై అందరూ శాంతియుతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని, హింసాత్మక వాదనలకు, హింసలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా వందమందికిపైగా మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన నేప థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయన్నారు. మావోయిస్టులను ప్రజాజీవనంలోకి వచ్చేలా పోలీసు అధికారులు ఒప్పించారని.. ఇది మంచి నిర్ణయమని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
రండి.. వచ్చేయండి!
ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హింసాయుత పంథాను వదిలేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ లేదన్నారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలే చర్చలకు దిగి అనేక సమస్యలను పరిష్కరిం చుకుంటున్నాయన్నారు. మావోయిస్టుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేస్తుంద న్నారు. దేవ్‌జీ, ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేసిందన్న రేవంత్‌రెడ్డి తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని వాళ్లు చెప్పారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామని తెలిపారు.
అదేసమయంలో మావోయిస్టుల సమస్యలను కేంద్రంతోనూ చర్చించనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. కీలక నాయకుడు గణపతి ని కూడా వచ్చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ఆయనకు గౌరవ ప్రదమైన జీవితాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామ న్నారు. వ్యక్తిగత భద్రతను కూడా కల్పిస్తామని చెప్పారు. ఇక, మావోయిస్టులు తమ తమ ప్రాంతాల్లోనే నివాసం ఉండాలని అనుకుంటే ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం.. ఒకచరిత్రగా అభివర్ణించారు. మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామన్నారు.
సీతక్కలాగా మారండి!
మావోయిస్టు పంథాను వీడి లొంగిపోయిన అనేక మంది రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని సీఎం తెలిపారు. ఉదాహరణకు మంత్రి సీతక్కేనని చెప్పారు. గతంలో మావోయిస్టుగా ఉన్నప్పటికీ.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని.. ప్రస్తుతం మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మావోయిస్టులు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే.. స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి నిర్బంధాలు ఉండబోవని వెల్లడించారు. వారికి అవసరమైన అన్నిసౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎవరిదైనా అంతిమ లక్ష్యం ప్రజాసేవే అయినప్పప్పుడు దానిని ఖచ్చితంగా ప్రోత్సహించే బాధ్యతను తీసుకుంటామన్నారు.