నీ పనేదో నువ్వు చూసుకో.. ట్రంప్‌కి కమల్ హాసన్ హెచ్చరిక

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షలు.. తాజాగా ఇచ్చిన మినహాయింపులు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.;

Update: 2026-03-08 04:44 GMT

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షలు.. తాజాగా ఇచ్చిన మినహాయింపులు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందన, భారత ఇంధన భద్రతపై విశ్లేషణాత్మక కథనంలోకి వెళితే..




 


రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా ప్రభుత్వం భారత్‌కు 30 రోజుల పాటు తాత్కాలిక `మినహాయింపు` ఇవ్వడంపై నటుడు, `మక్కల్ నీది మయ్యం` అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి `మీ పని మీరు చూసుకోండి` అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. భారత్ ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని.. ఏ విదేశీ శక్తి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదని ఆయన స్పష్టం చేశారు. సుదూర తీరాల నుంచి వచ్చే ఆజ్ఞలకు తలొగ్గే కాలం చెల్లిపోయిందని.. భారత దేశ విధాన నిర్ణయాలను గౌరవించాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్ అస్థిరంగా మారడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో.. చమురు సరఫరాలో లోటు రాకుండా ఉండేందుకు భారత్‌కు ఈ తాత్కాలిక మినహాయింపునిచ్చినట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. భారత్ బాధ్యతాయుతమైన మిత్రదేశమని ఆయన ప్రశంసించినా కానీ.. `మినహాయింపు` అనే పదంపైనే కమల్ హాసన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ అంతర్జాతీయ సంక్షోభం మధ్య భారత ప్రభుత్వం తన ఇంధన భద్రతపై పూర్తి ధీమా వ్యక్తం చేసింది. రష్యాపై ఆధారపడటమే కాకుండా.. భారత్ తన చమురు దిగుమతి వనరులను 27 దేశాల నుండి 40 దేశాలకు విస్తరించడం విశేషం. దేశ ప్రయోజనాలే పరమావధిగా... ఎక్కడ తక్కువ ధరలో నాణ్యమైన చమురు లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. బహుళ సరఫరా మార్గాలను సిద్ధం చేసుకోవడం వల్ల అంతర్జాతీయ యుద్ధాలు మన దేశ ఇంధన అవసరాలపై పెద్దగా ప్రభావం చూపబోవని భారత్ గట్టి సందేశాన్ని పంపింది.

చమురు రాజకీయాలు-భారత‌దేశ వ్యూహాలు

చమురు సంపదపై సాగుతున్న జియో పాలిటిక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నాయి. ఇంధనం అనేది కేవలం అవసరమే కాదు.. అది ఒక శక్తివంతమైన దౌత్య అస్త్రంగా మారింది. పశ్చిమ దేశాలు రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి చమురును ఆయుధంగా వాడుతుంటే.. ఇరాన్ వంటి దేశాలు హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాలను నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై ఆంక్షల పేరుతో ఒత్తిడి తీసుకురావడం సర్వసాధారణమైపోయింది. కానీ భారత్ వంటి పెరుగుతున్న ఆర్థిక శక్తిని నియంత్రించడం ఇప్పుడు అమెరికా వంటి దేశాలకు సవాలుగా మారింది.

భారతదేశం ప్రస్తుతం అనుసరిస్తున్న `బహుముఖ దౌత్యం` దానికి గొప్ప సానుకూలతగా మారింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్ అటు రష్యాతో సన్నిహితంగా ఉంటూనే.. ఇటు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఏ ఒక్క దేశంపై లేదా కూటమిపై ఆధారపడకుండా.. తన జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత్ గ్లోబల్ పాలిటిక్స్‌లో ఒక కీలకమైన `బ్యాలెన్సింగ్ పవర్`గా అవతరించింది. ఈ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కారణంగానే ఇతర దేశాలు ఆంక్షలు విధించినా లేదా మినహాయింపులు ఇచ్చినా భారత్ తనదైన శైలిలో ముందుకు వెళ్ల‌గలుగుతోంది.

Tags:    

Similar News