అవయవదానంతో ఎనిమిది మందికి ఊపిరి !

అవయవ దానం మీద ఇటీవల కాలంలో అవగాహన బాగా పెరుగుతోంది. గతంలో అయితే దేవుడు ఇచ్చిన అవయవాలు తిరిగి మట్టిలోనే కలసిపోవాలి అన్న పాతకాలం ఆలోచనలు ఉండేవి.

Update: 2026-08-02 00:30 GMT

అవయవ దానం మీద ఇటీవల కాలంలో అవగాహన బాగా పెరుగుతోంది. గతంలో అయితే దేవుడు ఇచ్చిన అవయవాలు తిరిగి మట్టిలోనే కలసిపోవాలి అన్న పాతకాలం ఆలోచనలు ఉండేవి. ఇపుడిపుడే అవయవదానం మీద అందరూ ముందుకు వస్తున్నారు. అవయవ దానం అంటే ఎంతో మందికి జీవితం. ఒక్క బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం తో ఏకంగా ఎనిమిది మందికి ప్రాణం పోయవచ్చు అంటే నమ్ముతారా కానీ అదే నిజం. వైద్య రంగం అంతకంతకు ఎదుగుతున్న నేపధ్యంలో అవయవ దానం మీద కూడా మరింత ఫోకస్ పెడుతున్నారు.

వేలాదిగా ఎదురుచూపు :

రాష్ట్రంలో చూస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకునేందుకు చూస్తున్నారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ఎదురు చూస్తూ కొస ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్‌ తాజా గణాంకాల ప్రకారం 2026 జూలై 1 నాటికి మొత్తం 5 వేల 839 మంది వివిధ రకాలైన అవయవాల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. వీరందరికీ బ్రెయిన్ డెడ్ దాతలే ఆశాకిరణంగా ఉన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అవయవ దానంతో ప్రాణాలు నిలబెట్టుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశం 2025 నాటి లెక్కల ప్రకారం చూస్తే ఆరవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక గత ఏడాది ఏకంగా 93 మంది అవయవ దాతలతో 301 అవయవ మార్పిడులు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

బ్రెయిన్ డెడ్ దాతల సంఖ్య హెచ్చుగా :

ఇక మరో వైపు చూస్తే రాష్ట్రంలో బ్రెయిన్ డెడ్ దాతల సంఖ్య ఏడాదికేడాది బాగా పెరుగుతుండటంతో అవయవ మార్పిడి సేవలు కూడా విస్తరిస్తున్నాయి. గత ఏడాది 93 మంది బ్రెయిన్ డెడ్ దాతల ద్వారా ఏకంగా 301 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగి జీవన్‌దాన్‌ చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచాయని అధికార వర్గాలు తెలిపాయి. 2023లో 41 మంది అవయవ దాతలు నమోదు కాగా 2024లో 66 మందికి 2025లో రికార్డు స్థాయిలో 93 మందికి ఈ సంఖ్య చేరింది. ఈ ఏడాది జూలై 24 నాటికే 56 మంది దాతలు నమోదయ్యారు. గతంలో కేవలం మూడు ఆసుపత్రులలో మాత్రమే అవయవ మార్పిడి సేవలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. గతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకే ఎక్కువగా పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు విజయవాడ, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు విస్తరించాయి.

మూత్రపిండాలకు అధిక డిమాండ్ :

అదే విధంగా చూస్తే జీవన్‌దాన్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారిలో అత్యధికంగా మూత్రపిండాల కోసం ఎదురుచూస్తున్నవారే ఉన్నారు. మూత్ర పిండాలు కోసం 3,715 మంది వేచి చూస్తే కాలేయం కోసం 2,009 మంది, గుండె కోసం 96 మంది, ఊపిరితిత్తుల కోసం 15 మంది, క్లోమగ్రంథి కోసం నలుగురు అవయవ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే బ్లడ్ గ్రూపుల వారీగా చూస్తే ఓ గ్రూప్‌కు చెందిన వారు 2,600 మంది ఉంటే బి గ్రూప్‌ వారు 1,721 మంది, ఏ గ్రూప్‌ వారు 1,179 మంది ఏబి గ్రూప్‌ 339 మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అవయవాల కేటాయింపులో ఎలాంటి సిఫార్సులు, పలుకుబడి లేదా దళారీలకు అవకాశం లేకుండా జీవన్‌దాన్‌ కేంద్రీకృత డిజిటల్‌ విధానాన్ని అమలు చేస్తోంది. రోగి నమోదు చేసిన తేదీ వ్యాధి తీవ్రత, కణజాల సరిపోలిక వంటి ప్రమాణాల ఆధారంగానే అవయవాలను కేటాయిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News