ఒక రాత్రికి రూ. 71,000 .. ఆతిథ్య రంగంలో రెహానేకు కళ్లు చెదిరే ఆదాయం
భారత క్రికెట్‌లో అత్యంత నిలకడైన.. సంయమనం గల ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అజింక్యా రహానే నికర ఆస్తుల విలువ ప్రస్తుతం సుమారు 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, క్లాసిక్ బ్యాటర్ అజింక్యా రహానే కేవలం మైదానంలోనే కాకుండా..వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఆస్తులు, వ్యాపారాలు.వివరాల్లోకి వెళితే...
భారత క్రికెట్‌లో అత్యంత నిలకడైన.. సంయమనం గల ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అజింక్యా రహానే నికర ఆస్తుల విలువ ప్రస్తుతం సుమారు 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అతడి అంతర్జాతీయ కెరీర్... బీసీసీఐ మ్యాచ్ ఫీజులు.. ఐపీఎల్ ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలు ఆయన ఆర్థిక పునాదిని బలోపేతం చేశాయి. కేవలం ఐపీఎల్ టోర్నమెంట్ల ద్వారానే అతడు కెరీర్‌లో రూ. 60 కోట్లకు పైగా ఆర్జించారు. ముంబైలోని ఖరీదైన సముద్రతీర అపార్ట్‌మెంట్‌తో పాటు.. రెహానే సంపాదనలో లగ్జరీ ఇళ్లు, ఆస్తుల వాటా కూడా గణనీయంగా ఉంది.
రెహానే వ్యక్తిగత జీవితంలో అతడి సతీమణి రాధికా ధోపవ్‌కర్ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన విజయాల వెనుక బలమైన అండగా నిలుస్తున్నారు. ఇక రహానేకు కార్లంటే ఉన్న ప్రత్యేకమైన ఆసక్తి అతడి గ్యారేజీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యంగ్ ప్లేయర్ వద్ద రేంజ్ రోవర్, ఆడి క్యూ5, వోక్స్ వ్యాగన్ వంటి కార్లతో పాటు దాదాపు రూ. 3 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్-మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 ఎస్‌యూవీ కూడా ఉంది. తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూనే..ఈ లగ్జరీ లైఫ్‌స్టైల్ అతడి ఉన్నత స్థాయికి నిదర్శనంగా నిలుస్తోంది.
రియల్ ఎస్టేట్ -ఆతిథ్య రంగంలో పెట్టుబడులు:
కేవలం క్రికెట్ సంపాదనకే పరిమితం కాకుండా రహానే రియల్ ఎస్టేట్- హాస్పిటాలిటీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల మహారాష్ట్రలోని సుందరమైన ఇగతపురి వద్ద వైతర్ణ సరస్సు సమీపంలో నిర్మించిన`రాయా ఎస్టేట్` లగ్జరీ విల్లా హాస్పిటాలిటీ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ 5 బెడ్‌రూమ్‌ల ప్రీమియం ప్రాపర్టీలో ఇన్ఫినిటీ పూల్, ఇన్-హౌస్ బార్ .. రహానే క్రికెట్ జ్ఞాపకాలను తెలిపే ప్రత్యేక మెమొరబిలియా రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టేవిస్టా ద్వారా ఒక రాత్రికి రూ. 71,000 పైచిలుకు అద్దెతో అందుబాటులో ఉన్న ఈ విల్లా అతడికి కనకవర్షం కురిపిస్తోంది.
స్టార్టప్‌లు- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఆదాయం..
రియల్ ఎస్టేట్‌తో పాటు పలు వర్ధమాన స్టార్టప్ కంపెనీలు, స్పోర్ట్స్-టెక్ .. ఫిట్‌నెస్ వెంచర్లలో రహానే తెలివిగా ఈక్విటీ పెట్టుబడులు పెట్టారు. పిల్లల కోసం రూపొందించిన `క్రికెట్ పాంగ్` యానిమేటెడ్ సిరీస్‌లో ఇన్వెస్టర్‌గా ... క్యూరేటర్‌గా వ్యవహరిస్తూ డిజిటల్ వ్యాపారాల వైపు కూడా అడుగులు వేశారు. అదనంగా నైక్, సీయట్, బూస్ట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రముఖ జాతీయ- అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోట్లలో ఆర్జిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు.
హాస్పిటాలిటీ రంగంలో టీమిండియా స్టార్స్
క్రీడా రంగంలో రాణిస్తూనే వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్న ప్రముఖుల జాబితాలో విరాట్ కోహ్లీ (రియల్ ఎస్టేట్, ఆతిథ్యం).. మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని (వ్యవసాయం - హోటల్ భాగస్వామ్యాలతో) ముందు వరుసలో ఉన్నారు. తాజాగా అజింక్యా రహానే కూడా ఇగతపురి విల్లా ప్రాజెక్ట్ ద్వారా ప్రీమియం హాస్పిటాలిటీ... టూరిజం రంగంలోకి అడుగుపెట్టి ఇతర క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆటతో పాటు మైండ్‌సెట్ బిజినెస్ వైపు మళ్లిస్తూ ఈ తరం క్రికెటర్లు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారో రహానే ప్రయాణం మరోసారి రుజువు చేస్తోంది.