వైసీపీకి కొరుకుడు పడని జిల్లాలు !
వైసీపీ అయితే ఈ రోజుకు ఎన్నికలు పెడితే తమదే అధికారం అని గట్టిగా చెప్పుకుంటోంది.
వైసీపీ అయితే ఈ రోజుకు ఎన్నికలు పెడితే తమదే అధికారం అని గట్టిగా చెప్పుకుంటోంది. అంతే కాదు మొత్తానికి మొత్తం సీట్లు ఊడ్చేస్తామని కూడా అంటోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ళకే ఫెయిల్ అయింది అని కూడా అంటోంది. కానీ వాస్తవంగా చూస్తే గ్రౌండ్ లెవెల్ లో సీన్ అలా ఉందా అన్నదే ప్రశ్న. అయితే వైసీపీ చేయించుకున్న సర్వేలను పక్కన పెడితే మామూలుగా చూస్తే కనుక రెండేళ్ళ తరువాత వైసీపీ పుంజుకుంది అన్న భావన ఉంది. అయితే ఎక్కడ పుంజుకుంది అంటే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ రాయలసీమలో అన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఉత్తరాంధ్రాలో కూడా రెండు జిల్లాలాలో వైసీపీ గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. అలాగే నెల్లూరులో వైసీపీకి కొంత సానుకూలత ఉందని అంటున్నారు.
అక్కడ మాత్రం చుక్కెదురు :
అదే సమయంలో సగానికి సగం జిల్లాలలో వైసీపీ ఇంకా చతికిలపడి ఉందని అంటున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉందని అంటున్నారు. దీనికి వైసీపీ 2024 తరువాత ఆత్మ పరిశీలన చేసుకోకపోవడం ఒక ఎత్తు అయితే మరో వైపు పార్టీని వీడిన నాయకులు ఆ ప్లేస్ లో బలమైన నాయకత్వం లేకపోవడం టీడీపీ జనసేన బలంగా ఉండడం అని అంటునారు. ముందుగా ఉభయ గోదావరి జిల్లాల గురించి చెప్పుకోవాలి అంటే వైసీపీ 2024 తరువాత పెద్దగా పుంజుకున్నది అయితే లేదని అంటున్నారు. దానికి జనసేన ప్రభావం రీజన్ అని అంటున్నారు. కాపులు మెజారిటీ ఇప్పటికీ జనసేనతోనే ఉన్నారు అని అంటున్నారు. అలాగే తెలుగుదేశం వైపు కూడా కాపులు బాగానే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక వైసీపీకి మాత్రం బలమైన సామాజిక వర్గం నుంచి మద్దతు అయితే ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. టీడీపీకి నియోజకవర్గాల స్థాయిలో గట్టి నేతలు ఉన్నారు, జనసేనకు పవన్ ఇమేజ్ ఉంది. వైసీపీకి అలాంటి నాయకత్వం లేకపోవడం ముఖ్య కారణంగా చెబుతున్నారు.
కోస్తాలో సైతం అంతే :
క్రిష్ణా గుంటూరు జిల్లాలలో కూడా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. చురుకైన నాయకత్వం ఆ పార్టీకి ఉంది. దానికి తోడు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఈ రోజుకీ సరైన క్లారిటీతో లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. అలాగే నాయకత్వ లోపం కూడా చాలా చోట్ల కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో సైతం వైసీపీ పుంజుకోలేదని అంటున్నారు. అక్కడ కూడా టీడీపీ బలంగా ఉంటే జనసేన విస్తరించాలని చూస్తోంది. ఇక వైసీపీకి స్ట్రాంగ్ లీడర్ల అవసరం పడుతోంది.
ఇక్కడ మాత్రం ఓకే :
గతంతో పోలిస్తే రాయలసీమ నాలుగు జిల్లాలలో వైసీపీ పరిస్థితి కొంత మెరుగు పడింది అని అంటున్నారు. ఆ పార్టీకి గట్టి నాయకులు ఉండడం బలమైన సామాజిక వర్గం దన్ను ఉండడం కారణంగా చెబుతున్నారు. అలాగే నెల్లూరులో కూడా వైసీపీకి కొంత సానుకూలత కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో చూస్తే విశాఖలో వైసీపీకి ఇబ్బందికరంగానే ఈ రోజుకీ ఉంది. కూటమి పట్టు ఇక్కడ వెరీ స్ట్రాంగ్ గా ఉంది. వైసీపీకి జిల్లా స్థాయిలో అందరినీ నడిపించే నాయకత్వం లోటు ఉంది అని అంటున్నారు. అయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో వైసీపీకి మంచి నాయకత్వం ఉంది. దాంతో గతానికి భిన్నంగా కొంత పుంజుకుంది అని అంటున్నారు.