వీడిన కల్తీ పాల మిస్టరీ.. 10 మంది ప్రాణాలు తీసిన ఎం-సీల్
రాజమండ్రి కల్తీ పాల మిస్టరీ వీడింది. పది మంది ప్రాణాలు తీసిన ఈ ఉదంతం వెనుక అసలు లోగుట్టు ఏమిటన్న విషయాన్ని వెల్లడించే తాజాగా రిపోర్టు విడుదలైంది.;
రాజమండ్రి కల్తీ పాల మిస్టరీ వీడింది. పది మంది ప్రాణాలు తీసిన ఈ ఉదంతం వెనుక అసలు లోగుట్టు ఏమిటన్న విషయాన్ని వెల్లడించే తాజాగా రిపోర్టు విడుదలైంది. కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో సంచలన అంశాలు ఉన్నాయి. ఈ కేసులో మరణించిన వారిలో ఐదుగురికి సంబంధించిన రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. అసలు కారణం ఇట్టే అర్థమవుతుంది పాల వ్యాపారి కక్కుర్తికి పది మంది బలి కావటమే కాదు.. పలువురు అనారోగ్యానికి గురైన పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
వరలక్ష్మి పాల కేంద్రాన్ని గణేశ్వరరావు నిర్వహిస్తున్నారు. పాలను సహజంగానే ఫ్రీజర్ లో నిల్వ ఉంచటం తెలిసిందే. అయితే.. ఈ ఫ్రీజర్ లీక్ అయ్యింది. దాన్ని సరైన పద్దతిలో మూసి వేయాల్సి ఉంది. కక్కుర్తితో ఎం-సీల్ ను అతికించాడు. దీంతో లీక్ కారణంగా విడుదలయ్యే రసాయనాలు పాలల్లో కలిసేవి. ఈ కారణంగా ఫిబ్రవరి 15 నుంచి పాల కేంద్రంలోని పాలు చేదుగా ఉన్నట్లు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ గణేశ్వరరావు పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే పది మంది ప్రాణాలు పోయేందుకు కారణమైంది.
ఫ్రీజర్ లీక్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ విషాద ఉదంతం చోటు చేసుకునేది కాదు. పాల కల్తీ విపరిణామాలతో పాల కేంద్రంలోని ఫ్రీజర్ తో పాటు ఇతర పదార్థాలను సైతం ల్యాబ్ కు పంపారు. వీటిని పరిశీలించిన అధికారులు అసలు లోపాన్ని గుర్తించారు. కల్తీ పాలు తాగిన వారిలో 20 మంది అస్వస్థతకు గురైతే.. పది మంది మరణించగా.. మరో పది మంది ఆసుపత్రిలో ఇప్పటికి చికిత్స పొందుతున్నారు. ఈ దారుణానికి కారణమైన గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇప్పటివరకు అతడిపై తొమ్మిది కేసులు నమోదయ్యాయి.
పాలలో ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత కెమికల్ కలిసినట్లుగా నిర్ధారించారు. ఈ కల్తీ పాలను తాగటంతో బాధితుల్లో పలువురికి కిడ్నీలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో.. వారు మరణించారు. ఫ్రీజర్ లీక్ అయిన వేళ.. దాన్ని సరైన పద్దతిలో మూసి ఉంటే ఇంత దారుణం చోటు చేసుకునేది కాదు. ఎం-సీల్ తో లీక్ ను పరిష్కరించొచ్చన్న కక్కుర్తి దారుణ విషాదానికి కారణమైందని చెప్పాలి.