ఇదేం శపధం జగ్గారెడ్డి? ఓడిస్తే పోటీ చేయటం మానేయాలా?
ఊళ్లల్లో ఒక ముతక సామెతను తరచూ వాడేస్తుంటారు. చెరువు మీద అలకతో అలా ఉండిపోతే నష్టం చెరువుకు కాదు.. సదరు వ్యక్తికే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.;
ఊళ్లల్లో ఒక ముతక సామెతను తరచూ వాడేస్తుంటారు. చెరువు మీద అలకతో అలా ఉండిపోతే నష్టం చెరువుకు కాదు.. సదరు వ్యక్తికే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన ప్రకటన చూస్తే.. ఇదే మాట గుర్తుకు రాక మానదు. జగ్గారెడ్డికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టిన సంగారెడ్డిపై ఆయన అలకబూనారు. ఎన్నికల్లో తనను ఓడించిన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తాను భవిష్యత్తులో పోటీ చేయనని.. చివరకు తన భార్య బరిలోకి దిగినా.. ఆమె తరపున ప్రచారం కూడా చేయనని స్పష్టం చేశారు.
సంగారెడ్డి మేధావులు తనను ఓడించారని.. అందుకే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా జగ్గారెడ్డి చెబుతున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి మరీ తనను గెలిపించేందుకు ప్రచారం చేస్తే.. తనను అక్కడ ఓడించిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఇక్కడ నన్ను ఓడించారు. రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేసినట్లు అయ్యింది. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా.. ఓడించారు. తన జీవితంలో మర్చిపోలేనిది. అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యా’ అని స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో తన ఓటమికి కారణం సాధారణ ప్రజలు కాదని.. సంగారెడ్డి మేధావులుగా ఆయన పేర్కొన్నారు. రేపు నా భార్య నిర్మలా పోటీ చేసినా.. సంగారెడ్డిలో ఆమె తరఫు ఎన్నికల ప్రచారం మాత్రం చేయనని తేల్చి చెప్పారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్లి ప్రచారమైనా చేస్తాను కానీ సంగారెడ్డిలో మాత్రం ససేమిరా అంటున్న జగ్గారెడ్డి మాటలు ఆసక్తికరంగా మారాయి, పెద్ద పెద్ద నేతలే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు కావటం మామూలే. అంతమాత్రాన తమను ఓడించిన ఓటర్లపై ఈ తరహా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.