మండుతున్న మధ్యప్రాచ్యం.. ప్రపంచానికి చమురు సెగ!.. రష్యాకు జాక్ పాట్
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం ప్రాంతీయ పోరాటంగా మిగిలిపోలేదు.;
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం ప్రాంతీయ పోరాటంగా మిగిలిపోలేదు. ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య పెరుగుతున్న వైరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి వంటి 'హర్మూజ్ జలసంధి'ను మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరిక.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో పెను తుఫానుకు సంకేతంగా మారుతోంది. ఇది ఒకవైపు ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెడుతుండగా మరోవైపు రష్యాకు రాజకీయంగా ఆర్థికంగా అనూహ్యమైన 'జాక్ పాట్'గా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.
హర్మూజ్: గొంతుపై కత్తి
ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని అడ్డుకుంటామన్న ఇరాన్ ప్రకటన చిన్న విషయం కాదు. "ఒక్క లీటర్ చమురును కూడా వెళ్లనివ్వం" అన్న ఇరాన్ కఠిన వైఖరి వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ప్రతిఘటన స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాకు మద్దతు ఇచ్చే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాల చమురు క్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలు.. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ మార్గం మూతపడితే చమురు సరఫరా గొలుసు తెగిపోయి.. బ్యారెల్ ధరలు ఊహించని స్థాయికి చేరడం ఖాయం.
రష్యాకు లభించిన ఊరట
ఈ సంక్షోభంలో అనూహ్యంగా లాభపడుతున్న దేశం రష్యా. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాశ్చాత్య దేశాల ఆంక్షలతో సతమతమవుతున్న వ్లాదిమిర్ పుతిన్‌కు.. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఒక ఆయుధంగా మారాయి. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా నిలిచిపోతే యూరప్ దేశాలకు రష్యా కంటే వేరే గత్యంతరం ఉండదు. చమురు సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి అమెరికా కూడా రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను సడలించే దిశగా ఆలోచించాల్సి రావడం పుతిన్ దౌత్య విజయంగానే భావించాలి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే.. రష్యా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇది ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి రష్యాకు అవసరమైన ఆర్థిక వెన్నుదన్నును అందిస్తుంది.
ప్రపంచ దేశాల భయం
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ పరిణామాలు గొడ్డలి పెట్టు లాంటివి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇంధన భద్రత అనేది ఇప్పుడు కేవలం వ్యాపార అంశం కాదు.. అది దేశాల సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా మారింది.
యుద్ధం ఎప్పుడూ విధ్వంసాన్నే మిగులుస్తుంది. అయితే ఈ మధ్యప్రాచ్య సమరంలో ఇరాన్ తన పంతం కోసం ప్రపంచ మార్కెట్‌ను స్తంభింపజేయాలని చూస్తుంటే ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ రష్యా తన పట్టును బిగిస్తోంది. రాజకీయ విద్వేషాల మధ్య సామాన్య దేశాలు నలిగిపోకుండా ఉండాలంటే అంతర్జాతీయ దౌత్య విభాగం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఇంధనాన్ని ఆయుధంగా వాడుతున్న ఈ 'ఎనర్జీ వార్' ఎక్కడికి దారితీస్తుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.