వార్ డ్యామేజ్ కంట్రోల్... తెలుగు యూట్యూబర్ అరెస్ట్
ఆ ప్రకటన ఉల్లంఘించిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వందలాది మందిని ఇప్పటికే ఆయా దేశాలు అరెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తోంది.;
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు కొనసాగుతున్నాయి. తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకార దాడులను ఇరాన్ చేస్తూనే వస్తోంది. దాంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికాను దెబ్బ తీసేందుకు గాను ఆ దేశం పై బాంబు దాడులు చేసే వీలు లేకపోవడంతో, ఆ దేశంతో సంబంధాలు ఉన్న దేశాలను ఇరాన్ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా దుబాయ్, సౌదీ, యూఏఈ ఇలా పలు దేశాల్లోని అమెరికా ఎయిర్ స్పేస్‌లపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ప్రశాంతతకి మారు పేరు అయిన అరబ్ దేశాలు యుద్దం వల్ల చాలా నష్టపోయాయి. టూరిజంపైనే ఆధారపడే ఆ దేశాలు ఇప్పుడు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో అక్కడి పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలియకుండా ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.
వార్ వీడియో ఫుటేజ్‌లపై ఆంక్షలు...
టూరిజంపై ఎక్కువగా ఆధారపడే ఆ దేశాల గురించి అంతర్జాతీయ మీడియాలో ఒకటి రెండు కథనాలు వచ్చినప్పటికీ స్థానిక మీడియాలో మాత్రం పెద్ద డ్యామేజ్ జరిగినట్లుగా వార్తలు రావడం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం కానీ, అవన్నీ త్వరలోనే సర్దుమనుగుతాయి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యుద్దం వల్ల జరిగిన నష్టం తాలూకు వీడియోలు, ఫోటోలను అరబ్ కంట్రీస్ బయటకు రానివ్వడం లేదు. అక్కడి నుంచి వీడియో ఫుటేజ్‌లు ఏ ఒక్కటీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ తమ కళ్లు కప్పి యుద్దంకు సంబంధించిన విజువల్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఉల్లంఘించిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వందలాది మందిని ఇప్పటికే ఆయా దేశాలు అరెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తోంది.
ఏపీ యూట్యూబర్ అరెస్ట్..
సౌదీ అరేబియాలో ఏసీ ఇంజనీర్‌గా పని చేసేందుకు ఏపీ నుంచి వెళ్లిన యువకుడు అక్కడి విషయాల గురించి యూట్యూబ్ ద్వారా తెలియజేస్తూ ఉండేవాడు. యూట్యూబర్‌గా అతడికి మంచి ఫాలోయింగ్ దక్కింది. పెద్ద సంఖ్యలో అతిడి సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫాలో అయ్యే వారు ఉన్నారు. అలాంటి కుర్రాడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులను కొంత మేరకు చూపించే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోస్‌కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో అతడిపై సౌదీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనధికారిక యుద్ద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, దేశం గురించి భయాందోళన కలిగించే వీడియోలను షేర్ చేశారు అంటూ కేసులో పేర్కొనడం జరిగింది. అతడిపై తప్పుడు వార్తల ప్రచారం కేసు పెట్టడంతో దాదాపుగా రెండు ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్థానికంగా ఉండే వారు చెబుతున్నారు.
అరబ్ కంట్రీస్‌లో 310 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మదనపల్లెకు చెందిన ఆ వ్యక్తి అరెస్ట్ ను స్థానిక పోలీసులు ఇప్పటికే దృవీకరించారు. కుటుంబ సభ్యులు అతడి కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడిని ఇండియాకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం సౌదీలోనే కాకుండా యూఏఈ, ఖతర్ వంటి ప్రాంతాల్లో కూడా యుద్ద వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అంటూ ఏకంగా 310 మందిని అరెస్ట్ చేశారని ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. యుద్దంకు సంబంధించిన విజువల్స్ ను కనీసం రికార్డ్ చేసినా కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని కొన్ని దేశాలు ఇప్పటికే హెచ్చరించాయి. అక్కడ నుంచి యుద్ధం కు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా ఉండటం వల్ల వార్ డ్యామేజ్ కొంత అయినా తగ్గుతుందని అక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.